CM Revanth Reddy: భారత్‌ ఫ్యూచర్‌సిటీలో సోమవారం (అక్టోబరు 19) పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఇబ్రహీంపట్నంలో కొత్తగా ఏర్పాటైన పోలీసు కమిషనరేట్‌ కార్యాలయ భవనాన్ని మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ నెలకొల్పనున్న యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని సందర్శిస్తారు.

డిసెంబరు 7 నుంచి 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమిట్‌’ ఏర్పాట్లను కూడా పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామంలో నిర్మించనున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐయూఎం) భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఫ్యూచర్‌సిటీ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి ఆదివారం ఇబ్రహీంపట్నంలోని కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. భద్రతా వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ) అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీలు కృష్ణ, జనార్దన్‌లను నియమించారు. ఫ్యూచర్‌సిటీ ప్రాంతంలో శాంతిభద్రతల బలోపేతం, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంలో కమిషనరేట్‌ భవనం కీలక ముందడుగని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Next Story