CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి 7 కీలక వరాలు ప్రకటించాలంటూ ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్‌రెడ్డి.. మెట్రో నగరాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి
మెట్రో నగరాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి
CM Revanth Reddy: దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఇంజిన్లుగా ఉన్న హైదరాబాద్, దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు వంటి ఆరు మెట్రోపాలిటన్ నగరాల అభివృద్ధికి ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేసి, కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కోరారు. ఒక్కో మెట్రో నగరానికి రూ. లక్ష కోట్ల చొప్పున మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 6 లక్షల కోట్లు కేంద్రం పెట్టుబడి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ఈ విజ్ఞప్తులు చేశారు. తెలంగాణకు కేటాయించాల్సిన ప్రాజెక్టులు, పథకాలతోపాటు విద్యా రంగంలో జాతీయ స్థాయి సంస్కరణల గురించి వివరించారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి అవసరమైన వివిధ ప్రాజెక్టులతో కూడిన వినతిపత్రం అందజేశారు. తెలంగాణకు తక్షణం 7 వరాలు ఇవ్వాలని కోరారు.
నాణ్యమైన విద్య, వైద్యంతోనే వికసిత్ భారత్ సాధ్యం
నైపుణ్యాభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరమని సీఎం నొక్కి చెప్పారు. కులగణన తర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను నీతి ఆయోగ్‌లో వివరించారు.
“వికసిత్ భారత్-2047 లక్ష్యం సాధించాలంటే దేశవ్యాప్తంగా నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలి. దేశాభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధే. విద్య, ఆరోగ్యం ద్వారా ప్రజలను ఆర్థిక శక్తులుగా, దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దాలి” అని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా సర్వేలో విద్యే సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రభావితం చేస్తున్న ముఖ్య అంశమని తేలిందని తెలిపారు.
యంగ్ ఇండియా స్కూళ్లు.. కులాల మధ్య గోడలు కూల్చేస్తాయి
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్ర స్నాక్స్, పాఠశాల బస్సులు, క్రీడా సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని సీఎం తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్‌లో చదువుకునే అవకాశం కల్పిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇవి కులాల మధ్య గోడలు కూల్చి సమానత్వాన్ని పెంపొందిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం
కృత్రిమ మేధ (AI) యుగంలో యువతకు కొత్త నైపుణ్యాలు అవసరమని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్వే, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఆనంద్ మహీంద్రా, శ్రీనిరాజు వంటి పారిశ్రామికవేత్తలు భాగస్వాములుగా ఉన్నారని వివరించారు. ఐటీఐలను ఆధునికీకరించడానికి టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, టాటా సంస్థ రూ.2,100 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటు తొలి విజయమని తెలిపారు.
2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం చేసిన ప్రధాన ప్రతిపాదనలు:
భారత్ ఫ్యూచర్ సిటీ (30వేల ఎకరాల్లో నెట్ జీరో గ్రీన్‌ఫీల్డ్)కి సహకారం.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతి, పీఎంకేఎస్‌వై కింద ఆర్థిక సాయం.
సెమీ కండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి చేయూత.
మూసీ పునరుజ్జీవన పథకానికి తోడ్పాటు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ (122.9 కి.మీ), రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర-దక్షిణ కారిడార్లు, హైదరాబాద్-అమరావతి-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌వే, వరంగల్ ఎయిర్‌పోర్టు వేగవంతం చేయాలని కోరారు.
ప్రధాని మోదీ సీఎం రేవంత్‌రెడ్డి వినతులను స్వీకరించి సానుకూలంగా స్పందించారని సమాచారం.
- A. Revanth ReddyNarendra ModiTelangana DevelopmentRevanth ReddySpecial FundsMetro CitiesInfrastructure DevelopmentTelangana GovernmentCentral AssistanceUrban DevelopmentEconomic GrowthState DevelopmentGovernment ProjectsPolitical NewsTelangana NewsIndia NewsBreaking NewsCurrent AffairsLatest Telugu NewsDevelopment AgendaIntergovernmental Relations



