Bhatti Vikramarka: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఆదివారం (ఏప్రిల్ 12, 2026) విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంను కలిసి తమ వివిధ సమస్యలను వివరంగా తెలిపారు. డిస్కంలను ప్రైవేటు పరం చేస్తారనే అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “డిస్కంలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోము. ఈ విషయాన్ని జేఏసీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేసి, అసత్య ప్రచారాలను ఖండించాలి” అని సూచించారు. విద్యుత్ సంస్థలను బలోపేతం చేయడం ఉద్యోగుల జేఏసీ మరియు అధికారుల బాధ్యత అని తెలిపారు.
ఉద్యోగుల సమస్యలు, ఇతర అంశాలను విని పరిష్కరించేందుకు ప్రతి నెల ఒక గంట సమయం కేటాయించేలా విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులను ఆదేశించనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ ఛైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్ రావు, కో-కన్వీనర్ బీసీ రెడ్డి, నాయకులు భూపాల్ రెడ్డి, సదానందం, స్వామి, రమేష్, అశోక్, సుధాకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, నాగరాజు, సత్యనారాయణ, దయానంద్, శివశంకర్, జనప్రియ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

