సమగ్ర సాంస్కృతిక విధానం అవసరం: కూనంనేని సాంబశివరావు

Kunamneni Sambasiva Rao: తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం సమగ్రమైన సాంస్కృతిక విధానాన్ని రూపొందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో ‘సమగ్ర సాంస్కృతిక విధానం - కళాకారులకు గుర్తింపు, ఆరోగ్య భద్రత, ఉద్యోగ అవకాశాలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సాంస్కృతిక సలహా మండలి సభ్యుడు పల్లె నర్సింహ అధ్యక్షత వహించారు.

సమావేశంలో మాట్లాడుతూ కూనంనేని.. కళారంగానికి తమ జీవితాలను సమర్పించి, సమాజంలో చైతన్యాన్ని నింపుతున్న కళాకారులకు ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. వారికి గుర్తింపు కార్డులు, ఆరోగ్య బీమా కార్డులు ఇవ్వాలని, క్రీడాకారుల మాదిరిగానే విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రత్యేక కోటా అమలు చేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా కళాకారులు ఆర్థికంగా, సామాజికంగా బలపడతారని, ప్రజల్లో సాంస్కృతిక విలువలు మరింత పెంచుకోవచ్చని అన్నారు.

సమావేశంలో సాంస్కృతిక సారథి ఛైర్‌పర్సన్ వెన్నెల, మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, నటుడు మాదాల రవి, కవి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాట్య మండలి కార్యవర్గ సభ్యులు, వివిధ కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. కళాకారుల సమస్యలపై చర్చలు జరిగి, ప్రభుత్వానికి సూచనలు అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story