Ponguleti Srinivasa Reddy: రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే చేపట్టామని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు అన్నదాతల సమక్షంలోనే రీసర్వే నిర్వహిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

బుధవారం మేడ్చల్‌ కలెక్టరేట్‌లో మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల రెవెన్యూ సమీక్ష సమావేశంలో ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూములపై వివాదాలు నెలకొన్నాయని, వాటిని పరిష్కరించేందుకు రోజూ ఆయా గ్రామాల్లో తహసీల్దార్లు పర్యటించాలని, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు.

22(ఏ)కు సంబంధించి ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, మెమోలతో పరిష్కారం కాని అంశాలు ఉంటే అధికారులు వాటిని పరిష్కరిస్తారన్నారు. వచ్చే ఏడాదిలోపు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అంగుళం భూమిని సమగ్రంగా సర్వే చేసి భూ యజమానులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు.

వివాదాలున్న భూముల్లో న్యాయం కోసం రెవెన్యూ అధికారులను ఆశ్రయించే ప్రజలు, రైతులకు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు సృష్టించే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు, పట్టా భూముల సమస్యలు, భూముల హద్దులపై వివాదాలను రీసర్వే ద్వారా పరిష్కరిస్తామని వివరించారు.

ఈ సమావేశంలో శాసనసభ స్పీకర్‌ జి.ప్రసాద్‌ కుమార్‌, ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్‌, కాలె యాదయ్య, ఆరికపూడి గాంధీ, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల కలెక్టర్లు సి.నారాయణరెడ్డి, మనుచౌదరి, దీపక్‌ తివారి, అదనపు కలెక్టర్లు కిరణ్మయి, విజయేందర్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated On  saroj
Next Story