TGPSC Chairman Burra Venkatesham : టీజీపీఎస్సీ: కంప్యూటర్ బేస్డ్ పరీక్షలే ఉత్తమం: టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం
టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం

TGPSC Chairman Burra Venkatesham : తమ ఉద్యోగం చాలా క్లిష్టమైనదని, అందరినీ మెప్పించడం సాధ్యం కాదని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ టీజీపీఎస్సీపై అసత్య ప్రచారాలు చేసేవారు ఎప్పుడూ ఉంటారని, అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు.
ఈ నెలలో 5 నుంచి 6 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఛైర్మన్ ప్రకటించారు. మీడియాతో మాట్లాడకపోవడం కంటే మాట్లాడటమే మంచిదని భావిస్తున్నామని, ఇకపై ప్రతి 2-3 నెలలకు ఒకసారి మీడియా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
పరీక్షల విషయానికి వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహణే ఉత్తమమైన విధానమని బుర్రా వెంకటేశం అభిప్రాయపడ్డారు. ఈ పద్ధతిలో పరీక్షకు గంట ముందు కూడా ప్రశ్నాపత్రం రూపొందించవచ్చని, OMR పద్ధతి చాలా క్లిష్టంగా ఉంటుందని వివరించారు. టీజీపీఎస్సీ అన్ని పరీక్షలను క్రమంగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించే దిశగా అడుగులు వేస్తోందన్నారు.
ప్రతి నెలా 2-3 నోటిఫికేషన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రస్తుతం 28 రకాల పోస్టుల్లో ఒక్కో ఖాళీ మాత్రమే ఉందని, మరో 25 రకాల పోస్టుల్లో 5 కంటే తక్కువ ఖాళీలు ఉన్నాయని చెప్పారు. జూన్ 2న మూడు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, 3,800 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి వచ్చిందని, 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయని ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు.

