మనకి డజను మంది ఎంపీలు ఉంటే బనకచర్లను అడ్డుకునే వాళ్లం – కేసీఆర్‌

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌ లు చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ సీయం రేవంత్‌ రెడ్డి స్పందించకపోవడంపై ఎండగట్టాలని భారతీయ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ నాయకులను ఆదేశించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో గడచిన మూడు రోజులుగా బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో భేటీ అయిన కేసీఆర్‌ తాజా రాజకీయ పరిస్ధితులు, పార్టీ కార్యచరణలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ఇప్పుడు గనుక మనకు ఒక డజను మంది ఎంపీలు ఉండి ఉంటే బనకచర్లపై పార్లమెంటులో గట్టిగా కొట్లాడేవారని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన ఎంపీల వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని కేసీఆర్‌ ఆందోళన చెందారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్లపై రాజకీయ, న్యాయపోరాటాలు చేయడానికి బీఆర్‌ఎస్‌ సిద్దం కావాలని కేసీఆర్‌ నాయకులకు సూచించారు. బనకచర్ల విషయంలో బహిరంగ సభలు నిర్వహించి ప్రజలకు నిజానిజాలు వివరించడంతో పాటు సుప్రీంకోర్టులో కూడా న్యాయపోరాటం చేయాలని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పార్టీ కార్యచరణను రూపొందించుకోవాలని సూచించారు. అదే సమయంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారార్భాటాన్ని ఎండగట్టాలని అన్నారు. ఇక ఫిరాయింపు శాసనసభ్యుల విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటి నుంచే పార్టీని ఉప ఎన్నికలకు సన్నద్దం చేయాలని కేసీఆర్‌ పార్టీ నేతలకు సూచించారు. అలాగే స్థానిక సంస్ధల ఎన్నికలను కూడా సీరియస్‌ గా తీసుకుని మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత నాయకులను ఆదేశించారు. కేసీఆర్‌ తో జరిగిన ఈ భేటీల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డిలతో పాటు పలువురు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story