Telangana RTC Union Elections: ఆర్టీసీ ఎన్నికల్లో టీడబ్ల్యూయూకు కాంగ్రెస్ పూర్తి మద్దతు
పూర్తి మద్దతు

Telangana RTC Union Elections: అక్టోబరు 9న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ - రిజిస్ట్రేషన్ నం. ఎ-4522)కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ శుక్రవారం హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో యూనియన్ ప్రతినిధులకు లేఖ అందజేస్తూ ఈ మేరకు ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడబ్ల్యూయూ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉందని, ఎన్నికల్లో యూనియన్ విజయానికి పార్టీ శ్రేణులు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఇతర యూనియన్లను ప్రోత్సహించవద్దని కూడా స్పష్టం చేశారు. ఎన్నికలకు కాంగ్రెస్ తరఫున సమన్వయం చేసేందుకు పీసీసీ ఉపాధ్యక్షుడు, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను ఇన్‌ఛార్జిగా నియమించినట్లు ప్రకటించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొగుళ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ, టీడబ్ల్యూయూకు కాంగ్రెస్‌తోపాటు తెలంగాణ జన సమితి, సీఐటీయూ అనుబంధ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఆర్టీసీ టీఎంయూ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు.
బొంతు రామ్మోహన్ సమష్టిగా పనిచేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. యూనియన్ నేతలు శంకర్, గోవింద్, రాజలింగం, వి.కె.రెడ్డి, యాదయ్య, చంద్రయ్య, రామ్ చందర్, నారాయణ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

