KTR Alleges: కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ ల్యాండ్ గ్రాబర్‌గా మారింది: కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
సీరియల్ ల్యాండ్ గ్రాబర్‌గా మారింది: కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

KTR Alleges: బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం సీరియల్ స్నాచర్‌గా (భూములను లాక్కునే వారిగా) వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఉర్దూ యూనివర్సిటీ భూములకు సంబంధించిన నోటీసుల నేపథ్యంలో నంది నగర్‌లో విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ... ‘‘భూములు లాక్కోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త కాదు. ఇదే మొదటిసారి కాదు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల భూమిని తీసుకున్నారు. విద్యార్థులు నిరసన తెలిపినా, ఆందోళనలను అణచివేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అదే తరహా భూదందా జరిగింది. అక్కడ సుమారు 400 ఎకరాలను లాక్కోవడానికి ప్రయత్నించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా కేసు తీసుకుని ఆదేశాలు జారీ చేసేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు’’ అని ఆయన వివరించారు.
ఉర్దూ యూనివర్సిటీ భూముల లాక్కునే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్, విద్యా సంస్థల భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. ఈ విషయంపై విద్యార్థులతో చర్చించి, వారి సమస్యలను అర్థం చేసుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా, వ్యవసాయ రంగాల్లో భూముల దోపిడీ పెరిగిపోయిందని ఆయన ఆరోపణలు ఎక్కుపెట్టారు.

