Kishan Reddy: రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం: కిషన్‌రెడ్డి
కిషన్‌రెడ్డి

Kishan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ధాన్యం సేకరణ అధ్వానంగా సాగుతోందన్నారు. దళారీలు, అధికారులు, ప్రభుత్వం మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భాజపా చేపట్టిన బస్సు యాత్ర వల్లే రాష్ట్ర ప్రభుత్వంలో కొంత చలనం వచ్చిందని కిషన్‌రెడ్డి అన్నారు. “కేంద్రం ధాన్యం తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నారు. కానీ ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత” అని స్పష్టం చేశారు.
ఖరీఫ్ సీజన్‌లో 58.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం-రాష్ట్రం మధ్య ఒప్పందం కుదిరినా, రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక రూపొందించకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కమీషన్లు, రియల్ ఎస్టేట్ వైపే ప్రభుత్వం దృష్టి సారిస్తోందని విమర్శించారు.

