CM Revanth Reddy: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం.. 87 అసెంబ్లీ సెగ్మెంట్లలో లీడ్: సీఎం రేవంత్ రెడ్డి
87 అసెంబ్లీ సెగ్మెంట్లలో లీడ్: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన అద్భుత విజయంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. మంత్రులతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని పేర్కొన్నారు. కష్టపడిన పార్టీ కార్యకర్తలకు, తమను ఆశీర్వదించిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
రెండేళ్ల పాలన తర్వాత ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు సంపూర్ణమైన మద్దతు లభించిందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. మొత్తం 12,702 గ్రామ పంచాయతీల్లో 7,527 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారని, ఇది సుమారు 66 శాతం విజయాలకు సమానమని వివరించారు. బీఆర్‌ఎస్, బీజేపీలు కూటమి కట్టి పోటీ చేసినా, రెండూ కలిపి కేవలం 33 శాతం మాత్రమే సాధించాయని ఆయన ఎత్తిచూపారు.
ఈ ఫలితాలు రెండేళ్ల ప్రజా పాలనకు ప్రతిఫలంగా భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. పార్టీ రెబల్స్‌గా పోటీ చేసిన 808 మంది గెలుపొందినప్పటికీ, మొత్తంగా కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులు 8,335 సర్పంచ్ పదవులు దక్కించుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ స్థాయిలో చూస్తే, ఎన్నికలు జరిగిన 94 సెగ్మెంట్లలో 87 చోట్ల కాంగ్రెస్ లీడ్‌లో ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ కేవలం 6 సెగ్మెంట్లలోనూ, బీజేపీ ఒక్క సెగ్మెంట్‌లోనూ మాత్రమే ముందంజలో ఉందని వెల్లడించారు. ఈ విజయాలు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో టూ-బై-థర్డ్ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావడానికి బాటలు వేస్తాయని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు.

