మెజారిటీ ఛైర్మన్ పీఠాలు గెలుచుకున్న కాంగ్రెస్

Telangana Municipal Elections: మేయర్, ఛైర్‌పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. రాష్ట్రంలోని నగర, పురపాలక సంఘాల పీఠాల్లో అత్యధికం హస్తం పార్టీకే దక్కాయి. పూర్తి మెజార్టీ వచ్చిన చోట్లతో పాటు హంగ్ అయిన ప్రాంతాల్లో కూడా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసింది.

ఏడు నగరపాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల ఎన్నికలు జరిగాయి. వీటిలో ఐదు చోట్ల కాంగ్రెస్ గెలుచుకుంది. కొత్తగూడెంలో మిత్రపక్షం సీపీఐతో కలిసి పీఠం దక్కించుకుంది. కరీంనగర్ కార్పొరేషన్‌లో భాజపా విజయం సాధించింది. నగరపాలక సంస్థల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎక్కడా పోటీలో లేకపోవడం గమనార్హం.

116 పురపాలక సంఘాల ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వివిధ కారణాలతో 11 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన 105 మున్సిపాలిటీల్లో 81 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ 18 చోట్ల, భాజపా ఒక చోట (నారాయణపేట) విజయం సాధించాయి. నాలుగు చోట్ల స్వతంత్రులు (భైంసా, ఆదిలాబాద్, జమ్మికుంట, మహబూబాబాద్) ఛైర్మన్ స్థానాలు దక్కించుకున్నారు. మరో చోట ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది.

ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటికీ వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులుగానే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలు దక్కించుకున్నారు. కాంగ్రెస్‌లో ఛైర్మన్ అభ్యర్థులు తేలక మూడు చోట్ల, వ్యూహాలు, ఉద్రిక్తతలతో మరో ఎనిమిది చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. తొర్రూరు, జనగామ, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.

మొత్తంమీద 80 శాతానికి పైగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. ఈ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు జరిగాయి. కౌంటింగ్ ప్రారంభానికి ముందే క్యాంపులు ప్రారంభించిన పార్టీలు సోమవారం విజేతలను మేయర్లు, ఛైర్మన్ల ఎన్నికలకు తీసుకొచ్చాయి. ఒక పార్టీ నుంచి గెలిచినవారు మరొక పార్టీకి మద్దతిచ్చడం, స్వతంత్రులకు భారీ మొత్తాలు చెల్లించి తమవైపు తిప్పుకోవడం వంటి ఘటనలు జరిగాయి. కొన్ని చోట్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను పంచుకున్నారు. రెబెల్ అభ్యర్థులకు అనూహ్యంగా పదవులు దక్కాయి.

నిజామాబాద్‌లో భాజపాకు 28, కాంగ్రెస్‌కు 17, ఎంఐఎంకు 14 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ ఒక సీటును కాంగ్రెస్ తమవైపు తిప్పుకుని మేయర్ స్థానం దక్కించుకుంది. కరీంనగర్ మినహా నల్గొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది.

ఈ ఫలితాలతో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రాంతాల్లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story