కేంద్రాన్ని సంప్రదించాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: హైదరాబాద్‌ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో జరిగిన ఒక సదస్సులో పాల్గొని ఆయన ప్రసంగించారు. 2047 నాటికి తెలంగాణ ప్రాధాన్యత రంగాలను వివరిస్తూ, రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రైవేటు రంగం మద్దతు గురించి పేర్కొన్నారు. ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ విజన్‌ను రూపొందించినట్లు చెప్పారు.

హైదరాబాద్‌లో కోటికి పైగా ప్రజలు నివసిస్తున్నారని, రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం 70 కిలోమీటర్ల మెట్రోను 150 కిలోమీటర్లకు విస్తరిస్తున్నామని, రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్న మెట్రోలో వచ్చే ఐదేళ్లలో 15 లక్షల మంది ప్రయాణించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. సబర్మతీ తీరంలా మూసీ నది తీరాన్ని అభివృద్ధి చేసేందుకు మూసీ రివర్‌ఫ్రంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని, కాలుష్య కారక పరిశ్రమలను హైదరాబాద్‌ వెలుపలకు తరలిస్తున్నామని, ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ఫ్యూచర్‌ సిటీ నిర్మిస్తున్నామని, విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌ సిటీకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌-బెంగళూరు మధ్య బుల్లెట్‌ రైలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తామని, డ్రగ్స్‌ కట్టడిలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని కొనియాడారు. 2034 నాటికి ట్రిలియన్‌ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగాలని, దేశ జీడీపీలో 10 శాతం తెలంగాణ నుంచి రావాలని తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story