CURE Act: క్యూర్ చట్టం అమలు.. హైదరాబాద్ నగరపాలనలో విప్లవాత్మక మార్పులు
విప్లవాత్మక మార్పులు

CURE Act: గాంధీ జయంతి రోజు (అక్టోబరు 2) నుంచి అమలులోకి వచ్చిన కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) చట్టం-2026తో హైదరాబాద్ మహానగర పాలనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కొత్త చట్టంతో ప్రజలకు మున్సిపల్ సేవలు మరింత సులభతరం కానున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను చూస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నగర పాలనపై నేరుగా పర్యవేక్షణ సాగించేలా కొత్త వ్యవస్థను రూపొందించారు. సీఎం అధ్యక్షతన క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ పనిచేస్తుంది. ఈ కౌన్సిల్ నగరాభివృద్ధి ప్రాధాన్యాలను నిర్ణయిస్తుంది. కార్పొరేషన్లు, పోలీస్, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, జలమండలి, విద్యుత్తు, మెట్రో, ఆర్టీసీ, హైడ్రా అధికారులు ఒకే వేదికపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.
1955లో మున్సిపల్ చట్టం వచ్చినప్పుడు హైదరాబాద్ జనాభా సుమారు 15 లక్షలు ఉండగా, ప్రస్తుతం కోర్ అర్బన్ రీజియన్ జనాభా దాదాపు 1.3 కోట్లు. నగరం భారీగా విస్తరించడంతో వరదలు, ఎండ తీవ్రత, వాయు కాలుష్యం, నీటి కొరత, ట్రాఫిక్, చెరువులు-నాలాల ఆక్రమణలు, ఎత్తయిన భవనాల్లో అగ్నిప్రమాదాలు వంటి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా నగర పాలనా వ్యవస్థను ఆధునీకరించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.
ఆస్తిపన్ను, సేవల్లో మార్పులు
ప్రతి ఆస్తికి ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్ (ఐపీఐసీ) ఇస్తారు. ఆస్తికి సంబంధించిన మున్సిపల్ వివరాలన్నీ ఈ గుర్తింపు సంఖ్యతో అనుసంధానమవుతాయి. ఆస్తిపన్ను, నీటి బిల్లు, మురుగునీటి ఛార్జీలు, పారిశుద్ధ్య బకాయిలను కలిపి ‘క్యూర్-1’ పేరుతో ఒకే బిల్లు ఇస్తారు. మున్సిపల్ సేవలు, అనుమతులు, లైసెన్సులను ఒకే పోర్టల్ ద్వారా పొందే విధానం వస్తుంది. ఆస్తి కొనుగోలు తర్వాత మ్యుటేషన్ ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరుగుతుంది.
ఆస్తిపన్ను విధానంలో కీలక మార్పు చేశారు. వార్షిక అద్దె విలువకు బదులుగా రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించే గైడ్‌లైన్ విలువ ఆధారంగా పన్ను లెక్కిస్తారు. నివాస ఆస్తులకు 0.10 నుంచి 0.50 శాతం, నివాసేతర ఆస్తులకు 0.20 నుంచి 2 శాతం మధ్య రేట్లను ఆయా కార్పొరేషన్లు నిర్ణయిస్తాయి. కొత్త రేట్లు ఖరారయ్యే వరకు నివాస ఆస్తులకు 0.15 శాతం, నివాసేతర ఆస్తులకు 0.75 శాతం వర్తిస్తుంది. 375 చదరపు అడుగుల లోపు ఆస్తులకు రూ.101 నామమాత్రపు పన్ను కొనసాగుతుంది. గత ఏడాది పన్నుతో పోలిస్తే ఏ సంవత్సరంలోనూ పెరుగుదల 10 శాతం దాటదు. ప్రస్తుతం రూ.10 వేలు చెల్లిస్తున్న వ్యక్తి మొదటి ఏడాది గరిష్ఠంగా రూ.11 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర ముఖ్యమైన మార్పులు
భవన అనుమతుల ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో సాగుతుంది. నిర్ణీత సమయంలో నిర్ణయం రాకపోతే డీమ్డ్ అప్రూవల్ అవకాశం ఉంది.
లైసెన్సింగ్ విధానం సులభతరం. నైట్ ఎకానమీ జోన్లు ప్రకటించనున్నారు. చిన్న ఉల్లంఘనలకు ముందుగా షోకాజ్ నోటీసు ఇచ్చి జరిమానా విధిస్తారు.
యుటిలిటీ కోఆర్డినేషన్ కమిటీ రోడ్డు తవ్వకాలపై శాఖల మధ్య సమన్వయం చేస్తుంది.
ట్రాఫిక్ నిర్వహణకు క్యూర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ అథారిటీ పనిచేస్తుంది. సేఫ్ స్కూల్ జోన్లు ఏర్పాటు అవకాశం ఉంది.
చెరువులు, నాలాలు, పార్కుల్లో ఆక్రమణలు, వ్యర్థాల పారవేతపై హైడ్రాకు చట్టబద్ధ అధికారం. నిర్మాణ వ్యర్థాలు పారేస్తే కఠిన జరిమానా.
క్యూర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ విపత్తుల నివారణ, స్పందన, పునరుద్ధరణ చర్యలు సమన్వయం చేస్తుంది. ఎత్తయిన భవనాలకు ఫైర్ ఆడిట్ తప్పనిసరి.
ఈ చట్టంతో హైదరాబాద్ నగర పాలన మరింత సమగ్రంగా, పౌరులకు సులభంగా మారనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

