Cyberabad Police Website : సైబరాబాద్ పోలీసు వెబ్‌సైట్.. న్యూ లుక్, ఫాస్ట్ సర్వీస్
న్యూ లుక్, ఫాస్ట్ సర్వీస్

Cyberabad Police Website : మెయింటెనెన్స్, అప్‌గ్రేడ్ పనుల కారణంగా తాత్కాలికంగా నిలిపివేయబడిన సైబరాబాద్ పోలీసు అధికారిక వెబ్‌సైట్ తిరిగి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు పోలీసు సేవలను మరింత సులభతరం చేయడం, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం వంటి కొత్త అప్‌డేట్లతో వెబ్‌సైట్ ప్రారంభమైంది. నవంబర్ 15 నుంచి జరిగిన డౌన్‌టైమ్ తర్వాత, ఇప్పుడు www.cyberabadpolice.gov.in అధికారిక వెబ్‌సైట్ యథావిధిగా పనిచేస్తోందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
సైబరాబాద్ ఎస్బీ & ఇన్‌ఛార్జ్ సైబర్ క్రైమ్స్ డీసీపీ వై.వి.ఎస్. సుధీంద్ర మాట్లాడుతూ, "ప్రజలకు అందుబాటులో సైబరాబాద్ పోలీసు వెబ్‌సైట్ ఉంది. నవంబర్ 15 నుంచి మెయింటెనెన్స్, అప్‌గ్రేడ్ పనుల కారణంగా తాత్కాలికంగా అందుబాటులో లేదు. అత్యవసర సాంకేతిక నిర్వహణ, భద్రతను పెంచేందుకు చేపట్టిన పనుల వల్లే ఈ డౌన్‌టైమ్ జరిగింది" అని తెలిపారు. ప్రస్తుతానికి వెబ్‌సైట్ పూర్తిగా పనిచేస్తోందని, ప్రజలు సమాచారం, వివిధ సేవల కోసం దీనిని యథావిధిగా వాడుకోవచ్చని ఆయన సూచించారు.
ఈ అప్‌గ్రేడ్‌తో వెబ్‌సైట్‌కు కొత్త లుక్ వచ్చింది. సర్వీసులు మరింత వేగవంతమవుతాయి. పోలీసు సేవలకు సంబంధించిన అన్ని వివరాలు, ఫిర్యాదులు, సమాచారం వంటివి సులభంగా అందుబాటులో ఉంటాయి. ప్రజల సౌకర్యార్థం ఈ మార్పులు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని డిజిటల్ సేవలు జోడించి, పోలీసు-ప్రజల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తామని డీసీపీ సుధీంద్ర హామీ ఇచ్చారు.
సైబరాబాద్ పోలీసు వెబ్‌సైట్ ద్వారా ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు సులభంగా సమర్పించవచ్చు. సైబర్ క్రైమ్స్‌కు సంబంధించిన సమాచారం, హెల్ప్‌లైన్ వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ అప్‌డేట్ ప్రజలకు మరింత వేగవంతమైన, భద్రమైన సేవలను అందిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

