అద్భుత నగరంగా తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీధర్ బాబు

D. Sridhar Babu: రాజధాని హైదరాబాద్‌ను అందరి సహకారంతో అద్భుతమైన విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో ఉందని స్పష్టం చేశారు.

శాసనసభలో మంగళవారం హైదరాబాద్ నగర అభివృద్ధి, వివిధ ప్రాజెక్టుల అమలు అంశంపై ప్రశ్నోత్తరాల సమయంలో భారాస సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాలు వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.15 వేల కోట్లతో సమగ్ర ప్రణాళిక రూపొందించామని, 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.2,250 కోట్లు ఖర్చు చేసి పనులు చేపడతామని తెలిపారు. త్వరలో హైదరాబాద్ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి సూచనలు, సహకారం తీసుకుంటామన్నారు.

నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి గత రెండేళ్లలో రూ.122 కోట్లు ఖర్చు చేశామని మంత్రి వివరించారు. పాతబస్తీ, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను పూర్తిగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మూసీ నది సుందరీకరణతో పాటు ‘హెచ్-సిటీ’ కింద రూ.7,032 కోట్ల అంచనాతో 26 పనులు, రూ.1,500 కోట్లతో 49 లింక్ రోడ్లు, రూ.7,406 కోట్లతో మూడు ఎలివేటెడ్ కారిడార్లకు ఆమోదం ఇచ్చామని చెప్పారు.

గత ప్రభుత్వం ఎస్‌ఆర్‌డీపీ కింద చేపట్టిన పనులను ఎక్కడా ఆపకుండా కొనసాగిస్తున్నామని, అవసరానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల జీవన నాణ్యత మెరుగుపరచడమే లక్ష్యమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story