Danam Nagender: ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌కు ప్రజా మద్దతు.. సుప్రీం తీర్పుకు స్వాగతం: మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్
మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్

Danam Nagender: ఎమ్మెల్యే పదవికి అనర్హత అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. ప్రజాక్షేత్రంలో తనకు బలముందని చెప్పారు. అనర్హత వేటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం గురువారం డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు.
‘‘ఎంపీగా పోటీ చేసినప్పుడే ఊహించా.. అదే జరిగింది. లీగల్‌గా పోరాడటంలో తప్పులేదు. పదో షెడ్యూల్ ప్రకారం రిలీఫ్ దొరుకుతుందని అనుకున్నా. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. నేను ప్రతి ఇంటికి వెళ్లి సేవ చేశా.. నేనేంటో ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఉప ఎన్నికలో పోటీపై సీఎం స్పష్టత ఇస్తారు. గతంలో మూడుసార్లు గెలిచాను. ఒక ఉప ఎన్నికలో 1,600 ఓట్లతో ఓడిపోయాను. ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలే ఇక్కడా రిపీట్ అవుతాయి. ఖైరతాబాద్ దానం నాగేందర్ అడ్డా. కలిసి పనిచేస్తాం.. తప్పకుండా గెలుస్తాం’’ అని దానం నాగేందర్ అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ సీటు ఖాళీగా మారింది. ఉప ఎన్నికకు మార్గం సుగమమైంది. దానం నాగేందర్ తన రాజకీయ భవిష్యత్తును ప్రజల చేతుల్లోకి వదిలేస్తున్నట్లు స్పష్టం చేశారు.

