నేడు సంఘటనా స్ధలానికి వెళ్ళనున్న సీయం రేవంత్‌ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని ఓ రసాయన పరిశ్రమలో సోమవారం జరిగిన రియాక్టర్‌ పేలిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరింగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 33 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పాశమైలారంలోని సిగాచి కెమికల్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలడంతో మూడంతస్తుల అడ్మినిస్ట్రేషన్‌ భవనం కుప్పకూలిపోయింది. పేలుడు ధాటికి పలువురు కార్మికులు పైకి ఎగిరి పడ్డారు. రియాక్టర్‌ దాదాపు 400 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ లో ఉన్న దశలో పేలడంతో కంపనీ అంతా తీవ్రంగా మంటలు వ్యాపించాయి. దీంతో మృతుల దేహాలు పూర్తిగా కాలిపోయాయి. డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి మృతులను గుర్తు పట్టాల్సిన పరిస్ధితి ఉంది. శిధిలాల కింద పదుల సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు చిక్కుకున్నట్లు రెస్క్యు బృందాలు గుర్తించాయి. అయితే రెస్క్యు టీమ్ లు శిధిలాలు తొలగిస్తున్నారు. మృతుల సంఖ్య 33కి చేరుకుంది. ఇంకా శిధిలాల కింద చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ సిబ్బందిలో 17 మంది గల్లంతైనట్లు గుర్తించారు. వీరందరూ కూడా శిధిలా కింద ఉండచ్చని అంచాన వేస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షేత్ర స్ధాయిలో జరుగుతున్న సహాయక చర్యలను సీయం ఎప్పటికప్పుడు కంపెనీ వద్ద పరిస్ధితులు సమీక్షిస్తున్న మంత్రులు దామోదర రాజనర్శింహ, గడ్డం వివేక్‌ లను అడిగి తెలుసుకుంటున్నారు. పాశమైలారం ఘటనపై సీఎస్‌, డీజీపీలతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీయం అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీయం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సహాయక చర్యలను పర్యవేక్షించి నిరంతరంగా కొనసాగించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్‌ రామకృష్ణారావు ఆధ్వర్యంలో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ సీఎస్‌, లేబర్‌ డిపార్ట్‌ మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, హెల్త్‌ సెక్రటరీ, ఫైర్‌ సర్వీసెస్‌ అడిషనల్‌ డీజీని కమిటీలో సభ్యులుగా నియమించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. నేడు ఉదయం పది గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాశమైలారంలో దుర్ఘటన జరిగిన సిగాచి కెమికల్‌ కంపెనీని పరిశీలించడానికి వెళ్లనున్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story