Minister Ponguleti :త్వరలో 4 లక్షల సాదాబైనామాలపై నిర్ణయం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి

- తొలగిన కోర్టు స్టే దరఖాస్తులకు త్వరలో మోక్షం
- దశల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల నిర్మాణం
రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను దశల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల పరిధిలోకి తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం నాడు గచ్చిబౌలిలోని తాలిమ్‌లో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవన నిర్మాణానికి శంకుస్దాపన జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటైన సభలో మంత్రి పొంగులేటి ప్రసంగించారు. గత ప్రభుత్వం అక్రమంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బంగాళాఖాతంలో కలిపేశామని, దేశంలోని 18 రాష్ట్రాలలో అధ్యయనం చేసి భూభారతి -2025 చట్టాన్ని రూపొందించామని తెలిపారు. రోల్ మోడల్‌గా నిలిచిన ఈ భూభారతి చట్టం మేరకు రైతన్నల, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సదస్సులు నిర్వహించగా 8.60 లక్షల దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. వీటిలో 2లక్షల దరఖాస్తులు పరిష్కారం కాగా సుమారు 4లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి పొంగులేటి వివరించారు. రాష్ట్ర హైకోర్టు నిన్ననే ఈ సాదాబైనామాలపై ఉన్నస్టేను తొలగించినందున నిజమైన, అర్హత కలిగిన దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
రాష్ట్ర ఆర్దిక పరిస్ధితి బాగులేకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నామని, గత ప్రభుత్వ తప్పులను గమనించి ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని పొంగులేటి అన్నారు. ప్రజల నమ్మకాన్ని వొమ్ము చేయకుండా ప్రగతి సాధనలో సాగుతున్నామని, ఈమేరకు ఒక్కొక్కటిగా అభివృద్ది కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని, దానిలో భాగంగానే ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ భవనాల శంకుస్దాపన అని మంత్రి చెప్పారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలోగల 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపేణా సుమారు 62-63 శాతం ఆదాయం లభిస్తోందని, వీటిని 11 ఇంటిగ్రేటెడ్ భవనాల పరిధిలోకి తీసుకువస్తామని తెలిపారు. ఈరోజు శంకుస్ధాపన చేసుకున్న ఈ భవనం అత్యాధునిక కార్పొరేట్ స్ధాయిలో ఉండబోతోందని, సుమారు మూడు ఎకరాలలోని దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 300 కార్లు పార్కింగ్ చేసుకునే సౌకర్యంతో నిర్మితమవబోతోందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఫైవ్ స్టార్ సౌకర్యాలతో సుమారు 8 నుంచి 9 నెలల్లో ఈ భవనాన్ని నిర్మిస్తామని నిర్మాణసంస్ధ చెబుతోందని, అయితే 6-7 నెలల్లోగా పూర్తి చేయాలని మంత్రి సభా ముఖంగా కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభిస్తామని చెబుతూ దశల వారీగా మిగిలిన 10 ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని సౌకర్యాలతో ఇటువంటి భవనాల నిర్మాణం చేపడతామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
