తెలంగాణకు అదనంగా 13 ఎంపీ సీట్లు కేటాయించాలి..

ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్లలోనే 33 శాతం మహిళలకు ఇవ్వాలి

Revanth Reddy: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ, శాసనసభల్లో మహిళా రిజర్వేషన్‌ను నియోజకవర్గాల పునర్విభజన అంశంతో కలగాపులగం చేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న పునర్విభజన తీరు వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శించారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల్లో మంగళవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ‘‘మహిళా రిజర్వేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే.. ఇప్పటి 543 లోక్‌సభ సీట్లలోనే 33 శాతం మహిళలకు కేటాయిస్తున్నామని ప్రకటించాలి. అప్పుడు మేము కూడా తెలంగాణ అసెంబ్లీలోని 119 సీట్లలో 33 శాతం మహిళలకు వెంటనే కేటాయించేస్తాం’’ అని సవాల్‌ విసిరారు.

అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం జరిగిన సభలో సీఎం మరింతగా వివరిస్తూ, ‘‘లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచుతామని, జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తామని కేంద్రం చెబుతోంది. ఇది దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 ఎంపీ సీట్లకు అదనంగా 13 సీట్లు ఇచ్చినప్పుడే న్యాయం జరుగుతుంది. లేని పక్షంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు నష్టం తప్పదు’’ అని అన్నారు.

జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయానికి బదులుగా సీట్లు తగ్గించడం సరికాదని, ఇది పురోగతికి శిక్ష వంటిదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాధికారం కోసం దక్షిణాది రాష్ట్రాలు సీట్ల పెంపుకు కొట్లాడాల్సి వస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేపట్టిన చర్యలు దేశానికే ఆదర్శమని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పాలనలో ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. గత పాలనలో వందేళ్ల నష్టం చేసినవారు ఇప్పటికీ వెనక నుంచి గోతులు తవ్వుతున్నారని, ప్రజలు వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

సభలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ మాట్లాడుతూ, అంబేడ్కర్‌ జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా చేయాలని సీఎంను కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు గొప్పగా చదువుకోవాలన్న లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా గురుకుల పాఠశాలలు నెలకొల్పుతున్నామని తెలిపారు. ఈ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తులో చరిత్ర సృష్టిస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, నవీన్‌యాదవ్‌, మందుల సామేల్‌, డా. కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ప్రీతమ్‌, ప్రొఫెసర్‌ కోదండరాం తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story