మున్సిపల్ ఎన్నికలు, రాజకీయాలపై చర్చ

Deputy Chief Minister Mallu Bhatti Vikramarka: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ (శ్రీధర్‌ బాబు), అడ్లూరి లక్ష్మణ్‌ సోమవారం రాత్రి ప్రజాభవన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ ఏర్పాటు చేసిన 'ఎట్‌ హోం' కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నలుగురూ నేరుగా ప్రజాభవన్‌కు చేరుకుని చర్చలు జరిపారు.

సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, మున్సిపల్‌ ఎన్నికల సన్నాహాలు, పార్టీలోని అంతర్గత విభేదాల పరిష్కారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను సమన్వయం చేసుకునేందుకు ఈ భేటీ సహాయపడుతుందని వర్గాలు చెబుతున్నాయి.

అంతకుముందు సోమవారం మధ్యాహ్నం జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్‌ ఎన్నికలకు పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఉత్తమ్‌తో జీవన్‌రెడ్డి చర్చలు జరిపారు. జగిత్యాల కూడా ఇదే లోక్‌సభ పరిధిలో ఉండటంతో తన అభిప్రాయాలను వివరంగా తెలియజేసినట్లు తెలుస్తోంది.

ఇక సమావేశంలో సింగరేణి సంస్థలోని నైనీ బొగ్గు గని టెండర్ల రద్దు విషయంపై కూడా కాసేపు చర్చ జరిగింది. పారదర్శకత కోసమే ఆరోపణలు రాగానే టెండర్లను రద్దు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులతో స్పష్టం చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విదేశాల్లో ఉన్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకత్వం అంతర్గత సమన్వయంపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story