కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం

Telangana Deputy Chief Minister Bhatti Vikramarka: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా నిర్లక్ష్యం చూపించారని, తీవ్ర అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి, రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారని ఆయన విమర్శించారు.

ప్రజాభవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ‘‘రాష్ట్రానికి బడ్జెట్‌లో ఏదైనా కేటాయింపులు ఉంటాయని ఆశపడ్డాం. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎంపీలు కలిసి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేశాం. మూసీ నది పునరుజ్జీవనం, రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌), మెట్రో విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు ఇస్తారని భావించాం. కానీ ఏమీ కేటాయించలేదు. బయోఫార్మా రంగంలో తెలంగాణ ప్రముఖ స్థానంలో ఉంది కదా... అయినా గుర్తుకు రాలేదు. సెమీ కండక్టర్‌ పరిశ్రమలకు కూడా మొండిచేయి చూపారు’’ అని ఆయన అన్నారు.

సంక్షేమ రంగాలపై కేంద్రం దృష్టి సారించలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి ఏమీ చేయలేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం వల్ల గ్రామీణ పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందని విమర్శించారు.

రాష్ట్రం ‘రైజింగ్‌ తెలంగాణ’ నినాదంతో ప్రపంచంతో పోటీపడాలని ప్రయత్నిస్తుంటే, కేంద్రం నిర్లక్ష్యం చూపుతోందని భట్టి అన్నారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో న్యాయం చేయాలని రాష్ట్ర ఎంపీలంతా పార్టీలకు అతీతంగా మరోసారి ఆర్థిక శాఖ మంత్రి, ప్రధానిని కలవాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.

జీఎస్‌డీపీలో ఆర్థిక ద్రవ్యలోటు పరిమితిని 4 శాతానికి పెంచాలని కోరినా పట్టించుకోలేదని, కేంద్రానికి 4.3 శాతం పెట్టుకున్నారని, దానినే రాష్ట్రాలకు వర్తింపజేయాలని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌ గేమింగ్‌, ఆడియో-విజువల్‌, కామిక్స్‌ రంగాలకు కేంద్రంగా ఉంది. మెడికల్‌ హబ్‌గా దేశంలో ముందుంది. ఇతర దేశాల నుంచి రోగులు వస్తున్నారు. అయినా ఈ రంగాలపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. మూసీ పునరుజ్జీవనం కోసం 56 కి.మీ. దూరంలో ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ ప్రాజెక్టుకు నిధులు కోరినా ఇవ్వలేదని చెప్పారు.

టూరిజం రంగంలో రామప్ప దేవాలయం, టైగర్‌ రిజర్వులు, జలపాతాలు ఉన్నా నిధులు కేటాయించలేదని బాధ వ్యక్తం చేశారు. రేర్‌ ఎర్త్‌ ఖనిజాలు సత్తుపల్లి, రామగుండం ప్రాంతాల్లో ఉన్నా దృష్టి సారించలేదని, సెమీ కండక్టర్లపై దేశాల గుత్తాధిపత్యం నుంచి బయటపడేందుకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ఆయన అన్నారు.

కేవలం మూడు రైలు మార్గాలు మాత్రమే ఇచ్చారని, ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి కనీసం అవసరమైనవి కూడా రాలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story