మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం ప్రకటించిన తెలంగాణ అసెంబ్లీ

రాజకీయ పార్టీలు వేరైనా వ్యక్తిగతంగా మాగంటి గోపీనాథ్‌ నాకు మంచి మిత్రుడని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్‌ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్‌కు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీయం రేవంత్‌రెడ్డి గోపీనాథ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నంచే గోపీనాథ్‌ చురుకుగా ఉండేవారని తెలిపారు. 1983లో తెలుగుదేశం పార్టీలో గోపీనాథ్‌ తన రాజకీయ ప్రస్ధానాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. 1985 నుంచి 1992 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారని తెలిపారు. గోపీ ఎన్టీఆర్‌కు గొప్ప భక్తుడని సినీ రంగంలో కూడా నిర్మాతగా రాణించారన్నారు. పాతబస్తీ, రవన్న, భద్రాద్రి రాముడు, నా స్టైలే వేరు వంటి సినిమాలను నిర్మించారని చెప్పారు. మూడు సార్లు వరుసగా శాసనసభ్యునిగా ఎన్నికైన ఘనత సాధించిన వారిలో గోపీనాథ్‌ ఒకరన్నారు. మాగంటి గోపీనాథ్‌ మరణం ఆయన కుటుంబానికి తీరని లోటని, ఆయన అకాల మరణం గోపీనాథ్‌ కుటుంబానికి శోకాన్ని మిగిల్చిందన్నారు. చూడటానికి మాగంటి గోపీనాథ్‌ క్లాస్‌గా కనిపించినా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి ఆయన మాస్‌ లీడర్‌ అని సీయం రేవంత్‌ కొనియాడారు. మాగంటి గోపీనాథ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని సీయం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాగంటి గోపీనాథ్‌ సేవలను గుర్తు చేసుకున్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story