Disqualified MLAs: సీఎంతో అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సమావేశం
ఎమ్మెల్యేల సమావేశం

Disqualified MLAs: బీఆర్‌ఎస్ పార్టీ అనర్హత పిటిషన్‌కు సంబంధించి స్పీకర్ ప్రసాద్‌కుమార్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీకి కడియం శ్రీహరి మినహా 9 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జ్వరం కారణంగా కడియం శ్రీహరి రాలేకపోయారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, తాను పార్టీ మారలేదని పలుమార్లు చెప్పినప్పటికీ, ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు న్యాయనిపుణులు పాల్గొన్నారు. అనర్హత కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసులు, ఎమ్మెల్యేల వివరణలపై న్యాయ నిపుణులతో చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిసినట్లు వివరించినట్టు తెలిసింది.
సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కువ చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పనులు, తక్షణం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులపై ఆరా తీశారు. వీటికి వెంటనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ సమస్యలు, సవాళ్లపై కూడా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
