సీఎం రేవంత్ వ్యాఖ్యలు

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మతాల మధ్య సామరస్యాన్ని, ఐక్యతను పాటించాలని పిలుపునిచ్చారు.

పశ్చిమాసియాలో యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో, ఇక్కడ కూడా మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారి ఉచ్చులో పడకూడదని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. మైనారిటీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.

ప్రభుత్వ మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ కేవలం ఒక పండగ మాత్రమే కాదని, ఆత్మశుద్ధి, ఉపవాసం, ఇతరులకు సహాయం చేయడం, సత్సంబంధాలు పెంచుకోవడం వంటి విలువలను గుర్తుచేసే పవిత్ర మాసమని వివరించారు.

మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ఆయన చెప్పారు. మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి, షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా నియమించడం, 8 మంది మైనారిటీ నేతలకు కార్పొరేషన్ పదవులు ఇవ్వడం వంటి చర్యలను గుర్తుచేశారు. అలాగే, క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం, బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్లు ప్రోత్సాహకంగా ఇవ్వడం వంటి విషయాలను ప్రస్తావించారు. వైఎస్ హయాంలో 4 శాతం మైనారిటీ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని గుర్తుచేశారు.

"ఈ ప్రభుత్వం మీదే. నేను మీ సోదరుడిని. మీ ఆశీర్వాదాలు, ఆశీస్సులు ప్రభుత్వానికి కావాలి" అని రేవంత్ రెడ్డి అన్నారు. అనంతరం ముస్లిం మతపెద్దలు ఆయనను సత్కరించారు. చిన్నారులకు బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్, ఎంపీలు బలరాం నాయక్, అనిల్ కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ మధు యాస్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story