DoorDash: అమెరికాకు చెందిన ప్రముఖ లోకల్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ డోర్‌డాష్‌ భారత్‌లో తన తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలో ప్రారంభించింది. ప్రస్తుతం సుమారు 500 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థ, వచ్చే రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్యను 3,000కు పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కేంద్రంలో ప్రారంభ దశలో కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అండ్‌ ఇంటెగ్రిటీ (సీఎక్స్‌ఐ), జనరల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాలు పనిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు ఉన్న అంతర్గత సీఎక్స్‌ఐ సర్వీస్‌ సెంటర్లలో హైదరాబాద్‌ కేంద్రం మూడోది. అమెరికాలోని టెంపీ, మెక్సికోలోని మెక్సికో సిటీ తర్వాత హైదరాబాద్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలకు హైదరాబాద్‌ కేంద్రం కీలకంగా వ్యవహరించనుందని సంస్థ ప్రకటించింది. వినియోగదారులు, వ్యాపారులు, డెలివరీ భాగస్వాములకు మెరుగైన సేవలు అందించడంలో ఇది క్రియాశీలకంగా వ్యవహరించనుంది.

డోర్‌డాష్‌ ప్లాట్‌ఫామ్‌కు ప్రపంచవ్యాప్తంగా 5.6 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్‌ వినియోగదారులున్నారు. 40కిపైగా దేశాల్లో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2025లో సంస్థ మార్కెట్‌ప్లేస్‌ గ్రాస్‌ ఆర్డర్‌ విలువ 100 బిలియన్‌ డాలర్లకు పైగా నమోదైంది.

హైటెక్‌ సిటీలో సంస్థ కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 500 జీసీసీలున్నాయి. మరో 100 దాకా ఏర్పాటు చేసి.. లక్షకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, 3 లక్షలకు పైగా పరోక్ష ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జీసీసీల్లో 5 లక్షల మందికిపైగా పనిచేస్తుండగా.. 2029 నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు చేరుతుందని అంచనా. ఫార్చ్యూన్‌ 500 సంస్థలు, కొత్త జీసీసీలను ఆకర్షిస్తున్న భారతీయ నగరాల్లో హైదరాబాద్‌ కీలక స్థానాన్ని కొనసాగిస్తోంది. హైదరాబాద్‌ జీసీసీ ఎకోసిస్టమ్‌లోకి తాజాగా డోర్‌డాష్‌ ఆగమనంతో హైపర్‌ లోకల్‌ డిజిటల్‌ కామర్స్‌ రంగం కూడా చేరినట్లైంది. హైదరాబాద్‌లో డోర్‌డాష్‌ పెట్టుబడి.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల రంగానికి ముఖ్యమైన పరిణామం. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ హైదరాబాద్‌ను ఎంచుకోవడం.. నగరంలోని ప్రతిభ, సాంకేతిక సామర్థ్యాలకు గుర్తింపు. 3,000 మందికి పైగా ఉద్యోగులతో కేంద్రం విస్తరించడం ద్వారా హైపర్‌ లోకల్‌ కామర్స్‌, కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌, టెక్నాలజీ, ఆపరేషన్స్‌ రంగాల్లో గ్లోబల్‌ సామర్థ్యాలు హైదరాబాద్‌కు తరలివస్తాయి’’ అని పేర్కొన్నారు.

డోర్‌డాష్‌ సీఎఫ్‌వో రవి ఇనుకొండ, వర్క్‌ఫోర్స్‌ స్ట్రాటజీ అండ్‌ టాలెంట్‌ ఎక్విజిషన్‌ ఆపరేషన్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ జెన్నా కోహ్నెకె, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story