CM Revanth: నీటి నాణ్యతపై ఎలాంటి రాజీ పడకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రాకుండా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను కఠినంగా ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో బుధవారం ఎస్‌టీపీలు (సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు) మరియు ట్రీటెడ్ వాటర్ వినియోగంపై సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, టీజీఎస్‌పీడీసీఎల్ ఎండీ జితేశ్ వి. పాటిల్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ప్రతి ఎస్‌టీపీ ప్లాంట్ దగ్గర స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలి. ప్లాంట్లను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలి. హైడ్రా ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ట్రీటెడ్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లలో ఏఐ టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. సోలార్ పవర్‌తో ప్లాంట్లను నడిపే అవకాశాలను పరిశీలించాలని కూడా చెప్పారు.

ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ల్యాండ్‌స్కేపింగ్, రోడ్ క్లీనింగ్‌కు ట్రీటెడ్ వాటర్ మాత్రమే వాడాలి. సెక్రటేరియట్, సీఎం కార్యాలయం, పబ్లిక్ పార్కుల్లో కూడా ట్రీటెడ్ వాటర్ వినియోగించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర (నాన్-పోటబుల్) అవసరాలకు వంద శాతం ట్రీటెడ్ వాటర్ వాడటం తప్పనిసరి చేయాలని ఆదేశించారు. రైల్వే డిపార్ట్‌మెంట్, మెట్రో రైల్‌ను కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. డేటా సెంటర్లకు కూడా ట్రీటెడ్ వాటర్ అందించాలి.

ట్రీటెడ్ వాటర్ ట్యాంకర్లను ట్రాక్ చేయాలని, దీనిపై విస్తృత ప్రచారం చేయాలని సీఎం ఆదేశించారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. భవన నిర్మాణ అనుమతుల సమయంలోనే ట్రీటెడ్ వాటర్ వినియోగ నిబంధన విధించాలి. ప్రైవేట్ ఎస్‌టీపీలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

నవంబర్ 1 నుంచి డిసెంబర్ వరకు ఈ ఆదేశాలు అమలు కావాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. మంచినీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, అధికారులు నిర్లక్ష్యంగా ఉండకూడదని హుకుం జారీ చేశారు.

Next Story