El Niño Impact: ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో 358 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. 18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. 324 మండలాల్లో భూగర్భ జలమట్టం ఆందోళనకర స్థాయిలో ఉందని గుర్తించింది. కరవు మండలాలను ఈ నెల 31లోగా ప్రకటించి, కేంద్రానికి జాబితా పంపాలని నిర్ణయించారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది.

శుక్రవారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, సీఎస్‌ సంజయ్‌ జాజు, సంబంధిత శాఖల కార్యదర్శులు హాజరయ్యారు.

‘‘తాగు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ అందుబాటులోని నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అత్యవసర ఖర్చులకు ఆర్థిక శాఖ నిధులు సమకూర్చాలి. రానున్న పంట సీజన్‌కు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి. విద్యుత్ సరఫరా, వ్యవసాయం, గ్రామీణ ఉపాధి రంగాలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి’’ అని ఉపసంఘం ఆదేశించింది.

డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ‘‘క్షేత్రస్థాయిలో శాస్త్రీయంగా పరిశీలించి నిబంధనల ప్రకారం కరవు ప్రభావిత మండలాలను ప్రకటించాలి. 20 శాతానికి మించి ప్రభావం ఉన్న మండలాల పరిస్థితులను గమనించాలి. విద్యుత్ సవాళ్లను గుర్తించి సరఫరాలో అంతరాయం రాకుండా వనరులను సమర్థంగా వినియోగించాలి. సాగునీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకునేలా రైతులకు ముందస్తు సమాచారం అందించాలి. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి’’ అన్నారు.

మంత్రులు ఉత్తమ్‌, తుమ్మల, సీతక్క, శ్రీహరి మాట్లాడుతూ.. ‘‘జిల్లాల్లో ప్రతివారం అధికారులతో సమావేశాలు నిర్వహించి కలెక్టర్లు సమీక్షించాలి. గ్రామస్థాయిలో రైతులకు సాంకేతిక సలహాలు, సాగు ప్రణాళికలు అందేలా చూడాలి. అన్ని మండలాల్లో భూగర్భజలాల మట్టం, వేసవి తీవ్రతపై గణాంకాల నివేదికలు ప్రతివారం విడుదల చేయాలి. కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలకు అత్యవసర నిధులు కేటాయించాలి. ప్రతి గ్రామంలో పశువులకు తాగునీటి తొట్టెలు నిర్మించాలి’’ అని సూచించారు.

సీఎస్‌ సంజయ్‌ జాజు వివరిస్తూ.. ‘‘కలెక్టర్లకు అత్యవసర నిధుల కింద రూ.కోటి చొప్పున విడుదల చేశాం. వర్షపాతం, పంటల విస్తీర్ణం 50 శాతం కన్నా తక్కువ సాగవడం వంటి ప్రమాణాల ఆధారంగా 358 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నట్లు నిర్ణయించాం. ఈ నెల 31లోగా కేంద్రానికి జాబితా పంపుతాం. 18 జిల్లాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. రిజర్వాయర్లలో మొత్తం 470 టీఎంసీలకు గాను 170 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. సింగూరు జలాశయంలో నీళ్లు తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాం’’ అన్నారు.

Next Story