Minister Ponguleti: ఎల్‌నినో ప్రభావంతో రానున్న కరవు పరిస్థితుల నేపథ్యంలో రైతులు రెండో పంట వేయవద్దని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం విద్యానగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి ఎల్‌నినో సన్నద్ధత, ఓటు బచావ్.. దేశ్ బచావ్, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అంశాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఏఐసీసీ, పీసీసీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.


సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. నీటి కరవును అధిగమించి పంటలు ఎండిపోకుండా ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల బోర్లలో ఇప్పటికే 15 లక్షల బోర్లు ఎండిపోయాయని, పంటలు వేసే సమయానికి బోర్లలో నీరు ఉండదని రైతులను హెచ్చరించారు. కాబట్టి రెండో పంట వేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.


కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి నిధులు కేటాయించే విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని మంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. ఓట్ల తొలగింపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా మారిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దిల్లీలో జరగనున్న పోరాటానికి కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు విషం కక్కుతున్నా ప్రభుత్వం వద్ద సమర్థమైన అస్త్రాలు ఉన్నాయని, భారాస తన వైఖరి మార్చుకోవాలని సూచించారు.


సమావేశానికి భద్రాద్రి డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న అధ్యక్షత వహించారు. నేతలు కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, దుద్దిళ్ల శ్రీనుబాబు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story