El Niño Impact: ఎల్‌నినో ప్రభావం కారణంగా తెలంగాణలో ఈ వానాకాలం సీజన్‌లో వరి ధాన్యం దిగుబడి, బియ్యం ఉత్పత్తి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వెల్లడించింది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఎల్‌నినో పరిస్థితులు ఉన్నందున ధాన్యం, బియ్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలోనే ఉంటుందని పేర్కొంది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు వైస్‌ఛాన్సలర్ జానయ్య, సుస్థిర వ్యవసాయ కేంద్రం సంచాలకుడు సమరేందు మహంతి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసి ‘తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం... బియ్యం దృక్పథం’ పేరిట నివేదికను విడుదల చేసింది.

2025 వానాకాలం సీజన్‌లో అనుకూల పరిస్థితుల వల్ల 67.30 లక్షల ఎకరాల్లో వరి సాగై 1.50 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. దాని నుంచి కోటి లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అయింది. ప్రస్తుత సీజన్‌లో మొదటి నాలుగు నెలల్లో తక్కువ వర్షపాతం నమోదు కావడం వరిసాగుకు అడ్డంకిగా మారింది. సీజన్ ముగిసే నాటికి 55.89 లక్షల ఎకరాల్లోనే వరి సాగైంది. ఇది నిరుటి కంటే 16.87 శాతం తక్కువ. నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి, జగిత్యాల వంటి జిల్లాల్లో వరి సాగు బాగా తగ్గింది.

రాబోయే రెండు నెలల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే 1.13 కోట్ల టన్నుల ధాన్యం మాత్రమే దిగుబడిగా రావచ్చని అంచనా. ఇది నిరుటి కంటే 37 లక్షల టన్నులు తక్కువ. మిల్లింగ్ అనంతరం 75 లక్షల టన్నుల మేరకు బియ్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఇది నిరుటి కంటే 25 లక్షల టన్నులు తక్కువ.

దేశంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 11.01 కోట్ల ఎకరాలకు గాను 10.60 కోట్ల ఎకరాల్లోనే వరి సాగవుతోంది. దేశవ్యాప్త పరిస్థితుల దృష్ట్యా వరి అధికంగా సాగవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నందున బియ్యం ఉత్పత్తి కూడా ఇక్కడే ఎక్కువగానే ఉంటుందని నివేదిక పేర్కొంది.

భారత్‌తోపాటు ఆసియాలో బియ్యం ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో ప్రస్తుత సీజన్‌లో, రాబోయే యాసంగిలోనూ వరిసాగుపై అనిశ్చితి ఉందని నివేదిక సూచించింది. ప్రధాన ఆహార పంటగా వరి ధాన్యం నిల్వ, సరఫరా, మార్కెటింగ్ తదితర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలని, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా సన్న రకాలు, ఎగుమతులకు అనుకూలమైన పొడవైన బియ్యం, పారా బాయిలింగ్‌కు అనువైన రకాలు సాగయ్యేలా చూడాలని సూచించింది. యాసంగిలోనూ వరిసాగుపై ప్రభావం పడనున్నందున నీటి లభ్యత మెరుగ్గా ఉండేలా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నారు.

Next Story