electric wires as Death traps

తెలంగాణలో కరెంటు తీగలు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా కరెంటు తీగలతో షాకింగ్‌ సంఘటనలు తగ్గుముఖం పట్టగా.. ఇప్పుడు ఏకంగా 24 గంటల వ్యవధిలో రెండు దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.



హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లో 11కేవీ వైర్లు తెగి పడి ఇద్దరు మరణించారు. ఓ కుక్క కూడా కరెంటు షాక్‌తో దగ్ధమయ్యింది. అటు.. జగిత్యాల జిల్లా కోరుట్లలో వినాయక విగ్రహాలు తరలిస్తున్న సమయంలో 33కేవీ కరెంటు తీగలు తగిలి మరో ఇద్దరు చనిపోయారు. ఏడుగురు కరెంటు షాక్‌ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.



ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న ఇద్దరు భిక్షగాళ్లపై చింతలకుంట ఫీడర్ కు సంబంధించిన 11 కేవీ వైర్లు తెగిపడ్డాయి. ఈ సంఘటనలో ఇద్దరు యాచకులతో పాటు ఒక కుక్క చనిపోయింది.



ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్ సమీపంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం ముందు ఫుట్‌పాత్ పై ప్రతిరోజు ఇద్దరు యాచకులు నిద్రిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజు రోడ్లపై చెత్త కాగితాలను సేకరించి అమ్ముకోవడంతోపాటు భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. శనివారం రాత్రి ఎప్పటిలాగే ఆ ఇద్దరు యాచకులు.. రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద ఉన్న ఫుట్ పాత్‌పై ఆదమరిచి నిద్రిస్తున్నారు. అయితే, అర్ధరాత్రి సుమారు రెండు గంటలసమయంలో పెద్ద శబ్దంతో 11 కేవీ విద్యుత్ వైరు తెగి రేణుక ఎల్లమ్మ తల్లి గుడి ఎదురుగా నిద్రిస్తున్న కుక్కపై మొదట పడి పోయాయి. విద్యుత్ షాక్ కు గురైన కుక్క ఎగిరి కొంత దూరంలో పడే సమయంలో… సదరు 11 కేవీ విద్యుత్ వైర్లు పక్కనే నిద్రిస్తున్న ఇద్దరు యాచకులపై పడ్డాయి. విద్యుత్ వైర్లు మీద పడటంతో ఇద్దరు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు.



అదే సమయంలో స్కూటీ పై అటు నుంచి వెళుతున్న ఓ వ్యక్తి విషయాన్ని గమనించి ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన ఎల్బీనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో, ఎలక్ట్రికల్‌ సిబ్బంది ఆ లైన్‌లో కరెంటు సరఫరా నిలిపేశారు. అయితే, ప్రమాదం జరిగిన కొద్ది దూరంలో విద్యుత్ స్తంభానికి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్లనే 11 కేవీ విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డాయని అధికారులు చెబుతున్నారు. వాహనం గుద్దిన తీవ్రతకు ఇన్సులేటర్ మెటల్ రాడ్ విరిగి విద్యుత్ వైర్లు తెగినట్లు భావిస్తున్నామన్నారు. అయితే, విద్యుత్ వైర్లు తెగడానికి ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణంలో విచారణ చేపడతామని అధికారులు వెల్లడించారు.



మరోవైపు.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కరెంటు తీగలు తగిలి షాక్‌తో ఇద్దరు మరణించారు. కోరుట్ల పట్టణంలోని వినాయక విగ్రహ తయారీ కేంద్రంలో తయారు చేసిన గణపతి విగ్రహాలను ఒక చోట నుంచి మరో చోటకు తరలిస్తున్న సమయంలో వీధిలో పైన ఉన్న 33 kv వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే వైర్లను కర్ర సాయంతో పైకి లేపారు. ఈ ఘటనలో గాయపడ్డ తొమ్మిది మందిలో ఆస్పత్రికి తరలించే లోపే ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. చనిపోయిన ఇద్దరిలో బాలాజీ కళా ఆర్ట్స్ వినాయక తయారీ ఓనర్ అల్వాల వినోద్, మరో వర్కర్ నెలూట్ల బంటి ఉన్నారు. గాయపడిన వారిలో ఇద్దరు మహారాష్ట్ర, ఇద్దరు యూపీ వాసులు ఉన్నారు.



అయితే, కరెంటు తీగలు ప్రమాదకరంగా పరిణమించి ప్రాణాలు తీస్తుండటం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. ఇక, హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్లో జరిగిన సంఘటనలో 11కెవి కరెంటు తీగలు తెగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎక్కువ లోడ్‌తో ఉండే కరెంటు తీగలు తెగిపోవడం అంటే.. ఎంత నాసిరకం పనులో అర్థమవుతున్నాయంటున్నారు కొందరు అధికారులు. జనావాసాల్లోంచి వెళ్లే ఇలాంటి హై లోడ్‌ కరెంటు తీగలు తెగేలా నాసిరకంగా ఉంటే ప్రజల ప్రాణాలకు భద్రత ఎలా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.




Politent News Web4

Politent News Web4

Next Story