CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై వినతి
వినతి

CM Revanth Reddy: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలతో పాటు విద్యా రంగ సమస్యల్ని త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్‌టీయూటీఎస్ నేతలు కోరారు.
పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్, ప్రధాన కార్యదర్శి బట్టాపురం మధుసూదన్‌రెడ్డి తదితరులు మంగళవారం రాత్రి సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంతోపాటు ఎంపీ వేం నరేందర్‌రెడ్డితో వివిధ సమస్యలపై చర్చించారు. పీఆర్‌సీని అమలు చేయాలని, పెండింగు డీఏలు, వివిధ రకాల బిల్లులు చెల్లించాలని సీఎంను కోరారు.
హెల్త్‌కార్డుల అమలుపై ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకురాగా.. ఈ నెల 15వ తేదీలోపు సమావేశం ఏర్పాటు చేసి, అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందేలా ఒప్పందాలు జరిపిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 2023 డీఎస్‌సీ టీచర్లకు పాత పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా.. సీఎస్‌తో సమావేశమై సమస్య పరిష్కరించాలని నరేందర్‌రెడ్డిని ఆదేశించారు.
సమావేశంలో సంఘం నేత సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, సంఘం పత్రిక ప్రధాన సంపాదకుడు జగన్‌మోహన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు సహకరించాలని సీఎం కోరినట్లు సమాచారం.

