CM Revanth Reddy: అవినీతి ముద్రను తుడిచివేయండి.. అక్రమాలు చేసేవారిని కట్టడి చేయండి: సీఎం రేవంత్
అక్రమాలు చేసేవారిని కట్టడి చేయండి: సీఎం రేవంత్

CM Revanth Reddy: రెవెన్యూ శాఖపై సమాజంలో అవినీతి ముద్ర పడిందని, ఈ చెడ్డ పేరును తొలగించే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పాలనాధికారులపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పరిపాలనలో అసమర్థత, అవినీతి ఆరోపణలను తప్పని నిరూపించాలని, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పని చేయాలని సూచించారు.
సెప్టెంబరు 5న హైటెక్స్‌లో జరిగిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో 5,106 మంది కొత్త గ్రామ పాలనాధికారులకు (GPO) సీఎం రేవంత్ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జీపీఓలతో “భూ సంబంధిత విధుల్లో పారదర్శకత, నిబద్ధత, న్యాయబద్ధంగా పని చేస్తాను” అని ప్రతిజ్ఞ చేయించారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ, కొత్తగా నియమితులైన జీపీఓలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములైన వారు చిన్న తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. భూభారతి చట్టాన్ని అమలు చేయడంతో పాటు సాదా బైనామా సక్రమీకరణకు హామీ ఇచ్చామన్నారు. పేదవారికి న్యాయం జరిగేలా జీపీఓలు అందుబాటులో ఉండాలని, 8-9 లక్షల సాదా బైనామా దరఖాస్తులను జాగ్రత్తగా పరిష్కరించాలని సూచించారు. ఈ ఉద్యోగం కేవలం ఉపాధి కాదని, ఆత్మగౌరవానికి సంబంధించిన బాధ్యత అని భావోద్వేగంతో చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో రెవెన్యూ సిబ్బంది కీలక పాత్ర పోషించారని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం నీరుగారిందని విమర్శించారు. గతంలో రెవెన్యూ సిబ్బందిని అవినీతిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని, ధరణి వ్యవస్థ వల్ల భూ సమస్యలు పెరిగాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని రద్దు చేసి, భూభారతి చట్టం తెచ్చామని, 1 లక్షా 56 వేల ఎకరాల భూ రికార్డులను ప్రక్షాళన చేసి, తప్పిదాలను సరిదిద్దామని తెలిపారు.
తెలంగాణలో భూమి ప్రజలకు తల్లి-బిడ్డ సంబంధంతో సమానమని, భూమి కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, భూదాన్ ఉద్యమం, ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా పేదలకు భూములు పంచిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. భూమిని చెరబట్టిన వారిని ప్రజలు తరిమికొట్టిన చరిత్ర ఉందని, ఈ బాధ్యతను జీపీఓలు నిర్వర్తించాలని కోరారు.
కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల రావు, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, పీఏసీ చైర్మన్ ఆరికె పూడి గాంధీతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
