Minister Ponguleti: గజం ప్రైవేటు భూమికీ ఆటంకం కలగదు: మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి

Minister Ponguleti: ప్రభుత్వం గజం ప్రైవేటు భూమికి కూడా ఎలాంటి ఆటంకం కలిగించదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. న్యాయబద్ధమైన భూముల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
సచివాలయంలో సోమవారం రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రభుత్వ జీవోలు, మెమోల ద్వారా హక్కులు పొందిన భూముల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాకపోవడంతో సమస్యలు తలెత్తాయని వివరించారు. గతేడాది హైకోర్టు ఆదేశాల మేరకు 22ఏ జాబితాను ఆన్‌లైన్‌లో పెట్టినప్పుడు పాత వివరాలు కూడా చేరడంతో నిషేధిత భూముల సమస్య వచ్చిందని చెప్పారు. ఈ సమస్య ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనే కాకుండా సంగారెడ్డి జిల్లాలోనూ కొంత మేరకు ఉందని తెలిపారు.
22ఏ జాబితాలో ప్రైవేటు ఆస్తులు చేరాయంటూ మేడ్చల్ జిల్లా నుంచి 511, రంగారెడ్డి నుంచి 146, హైదరాబాద్ నుంచి 49, సంగారెడ్డి నుంచి 38 దరఖాస్తులు వచ్చాయని మంత్రి వెల్లడించారు. గతంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్‌కు సంబంధించి 325 అర్హమైన కేసులు ఉన్నాయని, ఒకసారి స్పష్టత వచ్చినవి కూడా నిషేధిత జాబితాలో చేరినట్లు గుర్తించామని చెప్పారు. ఇందులో అధికారుల పొరపాటు ఉందని అంగీకరిస్తూ, సామాన్యులు ఇబ్బంది పడ్డందుకు చింతిస్తున్నానని, క్షమాపణలు చెబుతున్నానని పొంగులేటి అన్నారు. ఈ నెలాఖరు లోపు దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీల బహిరంగ వేలంపాటల ద్వారా కొనుగోలు చేసిన స్థలాలకు సంబంధించిన జీవోలు ఆన్‌లైన్‌లో లేకపోయినా పేపర్లపై రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, భూదాన్ భూముల పెండింగ్ వివాదాలపై నివేదిక రూపొందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని అల్విన్ కాలనీ, ఆస్‌బెస్టాస్ కాలనీల్లోని ప్రభుత్వ, ప్రైవేటు భూములను వర్గీకరించి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
ఫిర్యాదులు, సలహాల కోసం 1800 599 4788 టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్, సబ్‌రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్‌లకు దరఖాస్తులు సమర్పించవచ్చని, టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసినా మూడు రోజుల్లోగా సమాధానం లభిస్తుందని చెప్పారు. రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని కేసుల్లో కారణాలు స్పష్టంగా చెప్పాలని, ఇబ్బంది పడుతున్నవారికి ప్రత్యేక స్లాట్ కేటాయించి అత్యవసరంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఫీజు చెల్లించినా ప్రక్రియ పూర్తికాకపోతే తిరిగి చెల్లింపులు చేయాలని సూచించారు. 22ఏను బూచిగా చూపి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జూబ్లీహిల్స్‌లో సీఎం భూమి కూడా నిషేధిత జాబితాలో ఉందన్న ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ, తాను ఎలాంటి భూములు పెట్టించలేదని, సీఎం భూములు పెట్టితే తనవి కూడా ఉండొచ్చని చమత్కరించారు. జూబ్లీహిల్స్ సొసైటీ భూములు కొనుగోలు తర్వాత పేపర్లపైనే రిజిస్ట్రేషన్లు జరగడం, ఆన్‌లైన్ కాకపోవడంతోనే సమస్య వచ్చిందని వివరించారు. గతంలో రిజిస్ట్రేషన్లు, నాలా అనుమతులు, వ్యవసాయ భూములు వేర్వేరు అధికారుల పరిధిలో ఉండేవని, ఇప్పుడు అన్నీ ఒకే వ్యవస్థ కిందకు తీసుకువచ్చామని చెప్పారు.

