False Propaganda on Rythu Bharosa: రైతు భరోసాపై దుష్ప్రచారం అవాస్తవం: ప్రభుత్వం ఫ్యాక్ట్‌చెక్
ప్రభుత్వం ఫ్యాక్ట్‌చెక్

False Propaganda on Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం కొనసాగుతూనే ఉందని, నిజమైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా క్షేత్రస్థాయి ధృవీకరణ ప్రక్రియ జరుగుతోందని తెలిపింది. దురుద్దేశంతో వ్యాప్తి చేస్తున్న ఇలాంటి అసత్య సమాచారాన్ని రైతులు నమ్మొద్దని ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం హితవు పలికింది.
తెలంగాణలో ప్రస్తుతం 65 లక్షల మంది కంటే ఎక్కువ రైతులు రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయడం లేదని అధికారులు తేల్చి చెప్పారు. జిల్లా స్థాయి కమిటీలు నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రౌండ్ లెవల్ వెరిఫికేషన్ చేపడుతున్నాయి. అదే సమయంలో ఆర్థిక శాఖ కూడా చెల్లింపులకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసి, మరోసారి పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియలను దుష్ప్రచారంగా చిత్రీకరించడం తప్పుదారి పట్టించే ప్రయత్నమేనని ప్రభుత్వం ఆరోపించింది.
శాటిలైట్ మ్యాపింగ్‌తో ఖచ్చితమైన ధృవీకరణ
వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్న భూములను గుర్తించి, వాటికి రైతు భరోసా లబ్ధిని నిలిపివేయడం లక్ష్యంగా ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం జర్మన్ టెక్నాలజీ సహకారంతో శాటిలైట్ మ్యాపింగ్ చేపడుతోంది. 2024లో నిర్వహించిన గ్రౌండ్ సర్వేలో దాదాపు నాలుగు లక్షల ఎకరాల భూమి – ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల, ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ పరిధిలో – వాణిజ్య ఉపయోగంలో ఉన్నట్టు గుర్తించారు. ఈ మ్యాపింగ్ ద్వారా ప్రతి రైతుడి సాగు విస్తీర్ణాన్ని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. రైతు భరోసా పొందుతున్న భూమి రియల్ ఎస్టేట్ వెంచర్, ఫాంహౌస్ లేదా రోడ్డు కిందికి వెళ్లిందా అనేది కూడా స్పష్టమవుతుంది. ఈ ప్రక్రియ ఫీల్డ్ డేటాను రికార్డులతో మాత్రమే సరిపోల్చడానికి ఉద్దేశించింది.
గత సంవత్సరం రైతు భరోసా కింద రూ.8,500 కోట్ల నుంచి రూ.9,000 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమ చేశామని ప్రభుత్వం గుర్తు చేసింది. ఈ పథకంలో ఎలాంటి షరతులు విధించలేదు – రబీ లేదా ఖరీఫ్ సీజన్‌లో పంటలు పండించినా, ఒక సీజన్‌లో మాత్రమే పండించినా అర్హత ఉంటుంది. రెండు సీజన్లకు గాను ఎకరాకు రూ.12 వేలు చొప్పున సాయం అందుతుంది.
అభ్యంతరాలు ఉంటే ఇలా...
జాబితా నుంచి పేరు తొలగించినట్టు భావిస్తే, రైతులు జిల్లా కలెక్టర్ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు. గతేడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 90 రోజుల్లో పూర్తి చేయాల్సిన పంపిణీని కేవలం 9 రోజుల్లోనే ముగించి రికార్డు సృష్టించిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేసింది. నిజమైన రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
రైతులు దుష్ప్రచారాలకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అసత్య వార్తలను నమ్మొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

