Minister Ponguleti: నిషేధిత జాబితా 22ఏలో చిక్కుకున్న భూముల సమస్యలను ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో పరిష్కరిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగేలా అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.

బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమిషనర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 22ఏ జాబితాలో ఉన్న ప్రైవేటు భూముల విషయంలో ప్రస్తుత వాస్తవ పరిస్థితి, హక్కుదారుల వద్ద ఉన్న పత్రాలు, గత రిజిస్ట్రేషన్లు, రికార్డుల వివరాలను సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని పక్షంలో దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు.

సమస్య పరిష్కారమైన చోట్ల సబ్‌రిజిస్ట్రార్లు ప్రజలకు ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తూ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచిస్తున్నారు. బాలానగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలోని సర్వే నంబర్లు 101/1, 101/2, 102, 108, 109, 112, 81లో 3 వేల చదరపు మీటర్ల స్థలంపై 22ఏ నిషేధం తొలగింది. ఈ భూములకు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని సబ్‌రిజిస్ట్రార్‌ వెల్లడించారు.

పోచారం గ్రామంలోని సర్వే నంబరు 50ను గతేడాది డిసెంబరులో ఏపీ హౌసింగ్‌ బోర్డు భూమిగా పేర్కొంటూ 22ఏలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇటీవల కలెక్టర్‌ నుంచి క్లియరెన్స్‌ రావడంతో రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించారని నారపల్లి సబ్‌రిజిస్ట్రార్‌ సునీల్‌ తెలిపారు.

కూకట్‌పల్లి అడ్డగుట్ట సొసైటీలోని 300 ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. సొసైటీలోని నంబరు 80సీలో 250 గజాల స్థలం కొనుగోలు చేసిన ఒక వ్యక్తి గత నెలలో రిజిస్ట్రేషన్‌కు వెళ్లినప్పుడు 22ఏలో ఉందని తిరస్కరించారు. ప్రభుత్వం పరిష్కారం చూపడంతో మంగళవారం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చి బుధవారం రిజిస్ట్రేషన్‌ పూర్తయిందని సొసైటీ సభ్యుడు చక్రపాణి వివరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story