Minister Ponnam Prabhakar: ఎరువుల ఉత్పత్తి, సరఫరా బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి సరిపడా యూరియా ఎరువులు సరఫరా చేయకపోతే భాజపా నాయకుల ఇళ్ల ముందు కూర్చుంటామని హెచ్చరించారు. రామగుండంలో ఉత్పత్తి అయిన ఎరువులు పూర్తిగా తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్లు..

భారాస పాలనలో రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. నిరంతరంగా పంపిణీ ప్రక్రియ చేపట్టడంతో అర్హులందరికీ రేషన్ కార్డులు అందుతున్నాయన్నారు. ఈ రోజు రేషన్ కార్డు కోసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదని చెప్పారు.

భూసమస్యలు, కొత్త పెన్షన్ల కోసం కొన్ని దరఖాస్తులు వచ్చాయని, కొత్తగా రెండు లక్షల పెన్షన్లు మంజూరు చేశామని వివరించారు. త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం

రాష్ట్రంలో ఏ ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాకపోయినా ప్రజలు నేరుగా గాంధీభవన్‌కు వచ్చి వినతి చేస్తే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నెల 29న ఏరువాక పౌర్ణమి నుంచి వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, రైతు వేదికల ద్వారా విత్తనాలు, ఎరువుల పంపిణీని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారని వివరించారు.

ఈ కార్యక్రమం రైతుల సమస్యల పరిష్కారానికి, వ్యవసాయ రంగం అభివృద్ధికి ఉపయోగపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story