Defection MLAs : ఫిరాయింపు శాసనసభ్యులపై నేడు తుది తీర్పు
తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు సీజే ధర్మాసనం

తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపు శాసనసభస్యుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం తుది తీర్పు వెలువరించనుంది. ఈకేసు విషయంలో నేడు చీఫ్ జస్టిస్ ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్సుకత ఏర్పడింది. 2023లో భారతీయ రాష్ట్ర సమితి నుంచి శాసనసభ్యులుగా గెలుపొందిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లంవెంకటరావులు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీవివేకానందలు జనవరి 15వ తేదీ సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. అదే రోజు మరికొంత మంది బీఆర్‌ఎస్ శాసనసభ్యులైన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టి.ప్రకాష్‌గౌడ్, ఆరికెపూడిగాంధీ, శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, డాక్టర్ ఎం.సంజయ్‌కుమార్‌లు కూడా పార్టీ ఫిరాయించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గుంటకండ్ల జగదష్‌రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, కేపీవివేకానంద, చింతప్రభాకర్, సంజయ్ కల్వకుంట్లలు సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలుచేశారు. ఈ పిటీషన్లపై వాదనలు జరుగుతుండగానే బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా మరో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసి దానం నాగేందర్‌ను ప్రతివాదిగా పేర్కొన్నారు. ఈ అన్ని పిటీషన్లను కలిపి విచారించిన సుప్రీం ధర్మాసనం తీర్పును ఎనిమిది వారాలకు రిజర్వ్ చేస్తూ ఏప్రిల్ 3వ తేదీన ప్రకటించింది. దేశవ్యప్తంగా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న ఈ ఫిరాయింపుల కేసును జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ జార్జిమసీలతో కూడిన ధర్మాసనం చివరి సారిగా ఏప్రిల్ 3వ తేదీన విచారించింది. ఆనాడు ధర్మాసనంలో ఉన్న జస్టిస్ గవాయ్ నేడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. తాజాగా గురువారం ఈ ఫిరాయింపుల కేసుపై తీర్పు వెలువరించే సీజే ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ గవాయ్‌తో పాటు జస్టిస్ వినోద్ చంద్రన్‌లు ఉన్నారు.
