తొలి దశ డీపీఆర్ సిద్ధం

అంచనా వ్యయం రూ.6,500 నుంచి రూ.7,000 కోట్లు.. 1,435 నిర్మాణాలు ప్రభావితం

బఫర్ జోన్‌లోని వారికి టీడీఆర్.. 2013 చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాసం

Musi Development Project: మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించిన డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) తయారైందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. శాసనసభలో మంగళవారం జరిగిన మూడోరోజు సమావేశాల్లో మూసీ ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాదోపవాదాలు జరిగాయి.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు చేపట్టగా, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్ తదితరులు మూసీ ప్రాజెక్టుపై ప్రశ్నలు సంధించారు. స్పందిస్తూ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, “మూసీ ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్ సిద్ధమైంది. దీని అంచనా వ్యయం రూ.6,500 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల మధ్య ఉంటుంది” అని తెలిపారు.

ప్రాజెక్టు అమలులో భాగంగా 1,435 నిర్మాణాలు ప్రభావితం కావచ్చని, వాటి తుది ఎన్యుమరేషన్ (లెక్కింపు) ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి వివరించారు. బఫర్ జోన్‌లో ఉన్నవారికి టీడీఆర్ (ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డెవలప్‌మెంట్ రైట్స్) ఇవ్వనున్నట్లు చెప్పారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అవసరమైన భూముల సేకరణ, సహాయం, పునరావాస కార్యక్రమాలను చేపడతామని హామీ ఇచ్చారు.

ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “మేము మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు. ప్రాజెక్టు సకాలంలో, సమర్థవంతంగా అమలు కావాలని కోరుకుంటున్నాం” అని స్పష్టం చేశారు.

మంత్రి శ్రీధర్‌బాబు స్పందనలో మూసీ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరం మరింత అందంగా, సురక్షితంగా మారుతుందని, ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై సభలో ఇరు వర్గాల మధ్య చర్చ సాగింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story