మీడయాకు సూచించిన టీజీసీపీసీఆర్‌ చైర్పర్సన్‌ సీతా దయాకర్‌రెడ్డి

పిల్లలకు సంబంధించిన వార్తలను కవర్‌ చేసేటప్పుడు మీడియా కఠినమైన ఎన్‌సీపీసీఆర్‌ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని తెలంగాణ స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ రైట్స్‌ స్పష్టం చేసింది. టీజీసీపీసీఆర్‌ చైర్మన్‌ కొత్తకోట సీతా దయాకర్‌ రెడ్డి ఆ మేరకు మీడియాకు సూచనలు చేశారు. వివిధ టీవీ ఛానెళ్ళు, మీడియా, వార్తా పత్రికలలో పిల్లలపై వార్తలను ఎటువంటి ప్రోటోకాల్‌ మార్గదర్శకాలను పాటించకుండా ప్రసారాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇకపై ఎట్టిపరిస్ధితుల్లో ఎన్‌సీపీసీఆర్‌ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని టీజీసీపీసీఆర్‌ చైర్మన్‌ మీడియా సంస్ధలకు సూచించారు. చాలా సందర్భాలలో పిల్లల గోప్యతతో పాటు వారి హక్కులు మీడియాలో ఉల్లంఘిస్తున్నారని కమిషన్ గమనించినట్లు సీతా దయాకర్‌రెడ్డి పేర్కొన్నారు. లైవ్ కవరేజ్ సమయంలో మైనర్ బాధితుడి ముఖాలు గుర్తించే విధంగా ప్రసారాలు ఉంటున్నాయని, విలేకరులు పిల్లలను చాలా వ్యక్తిగతమైన, గోప్యతగా ఉండవలసిన అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారని కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఎత్తి చూపారు. టీఆర్‌పీల కోసం పిల్లలతో కఠినంగా వ్యవహరించడం సరికాదని ఆమె హితవు పలికారు. ఇటువంటి రిపోర్టింగ్‌ అనైతికమే కాకుండా మైనర్లకు రక్షణగా ఉన్న చట్టాలను ఉల్లంఘించడమే అని టీజీసీపీసీఆర్‌ చైర్పర్సన్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్‌తో కలిసి ఎన్‌సీపీసీఆర్‌ జారీ చేసిన మార్గదర్శకాల హ్యాండ్‌బుక్‌లను అన్ని ప్రింట్ అండ్‌ ఎలక్ట్రానిక్ మీడియాకు అందజేయాలని టీజీసీపీసీఆర్‌ చైర్పర్సన్‌ సీతా దయాకర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story