Saraswati River Anthya Pushkaralu: సరస్వతీ నది అంత్య పుష్కరాలు తెలంగాణలో ఘనంగా ఆరంభమయ్యాయి. గురువారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖలు పుష్కరాలను ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. తొలిసారి అంత్య పుష్కరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భారీ టెంట్లు, కూలర్లు, తాత్కాలిక గదులు (300కి పైగా) ఏర్పాటు చేశారు. సరస్వతీ ఘాట్‌తోపాటు ప్రధాన ఘాట్‌ల వద్ద స్నానం చేసే భక్తుల కోసం దుస్తులు మార్చుకోవడానికి సౌకర్యాలు కల్పించారు. భద్రతా దృక్పథంతో నదిలో లోతు ప్రాంతాల్లోకి వెళ్లకుండా తాళ్లతో హద్దులు వేశారు.

జూన్ 1 వరకు ప్రతి సాయంత్రం హారతి నిర్వహించనున్నారు. అంత్య పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.

పుష్కరాల విశిష్టత

ప్రాణహిత-గోదావరి నదుల మధ్య అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది కాళేశ్వరం ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. దేశంలో సరస్వతీ నది ఉన్న రెండు ప్రధాన ప్రాంతాలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, తెలంగాణలోని కాళేశ్వరం. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ఆనవాయితీగా నిర్వహిస్తారు. తెలంగాణలో మొదటిసారి అంత్య పుష్కరాలకు ఈ స్థాయి ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.

ఆది పుష్కరాల్లో నదీ స్నానం, పితృతర్పణాలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో, అంత్య పుష్కరాల సమయంలో కూడా అదే ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ అపూర్వ సందర్భాన్ని వేడుకగా చేసుకోవాలని ప్రభుత్వం, అధికారులు ఆహ్వానం ఇచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story