Bhatti Vikramarka: కాజీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ శంకుస్థాపన: ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్య లక్ష్యం – భట్టి విక్రమార్క
భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: హనుమకొండ జిల్లా కాజీపేట విద్యానగర్లో రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) భవన నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం శంకుస్థాపన చేశారు. ప్రపంచంతో తెలంగాణ రాష్ట్రం పోటీపడేలా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యావ్యవస్థను పటిష్ఠం చేస్తున్నారని, ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అందుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క తెలిపారు.
విద్యతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా సెమీ రెసిడెన్షియల్ విధానంలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అధునాతన బోధన పద్ధతులు, డిజిటల్ తరగతులు, పాఠశాలలోనే అల్పాహారం, మధ్యాహ్న భోజనం, విద్యార్థులను ఇళ్ల నుంచి తీసుకొచ్చి తిరిగి ఇళ్ల వద్దకు చేర్చే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యనభ్యసించేలా పబ్లిక్ పాఠశాలలు రూపొందుతున్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కుడా ఛైర్మన్ గుండు సుధారాణి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

