Minister Sridhar Babu: రాష్ట్రంలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. ‘తెలంగాణ ఏఐ అండ్‌ క్లౌడ్‌ స్కిల్లింగ్‌ ఇనిషియేటివ్‌’ కార్యక్రమంలో భాగంగా అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) సహకారంతో ఈ శిక్షణను అందిస్తామని తెలిపారు.

సోమవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌), ఏడబ్ల్యూఎస్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలోని 643 టాస్క్‌ అనుబంధ కళాశాలల్లోని విద్యార్థులకు ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా ఇంజినీరింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌, జనరేటివ్‌ ఏఐ వంటి ఇండస్ట్రీ ఆధారిత అంశాల్లో శిక్షణ ఇస్తాం. ప్రత్యక్షంగా ప్రాక్టికల్స్‌ చేసేందుకు ఏడబ్ల్యూఎస్‌ క్లౌడ్‌ కన్సోల్‌ సౌకర్యం కల్పిస్తాం’’ అని అన్నారు.

ఆర్ట్స్‌, కామర్స్‌ తదితర నాన్‌ స్టెమ్‌ కోర్సుల విద్యార్థులకు కూడా ప్రత్యేక లెర్నింగ్‌ ట్రాక్‌లు అందుబాటులో ఉంటాయని, ఈ కోర్సులో చేరిన ప్రతి విద్యార్థికి ‘ఏడబ్ల్యూఎస్‌ స్కిల్‌ బిల్డర్‌’ ద్వారా 900కు పైగా డిజిటల్‌ కోర్సులను ఏడాదిపాటు ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. గ్లోబల్‌ సర్టిఫికేషన్‌ పరీక్షల కోసం డిస్కౌంట్‌ వోచర్లు అందిస్తామని, విద్యార్థులకు సాంకేతిక నిపుణులతో ఇండస్ట్రీ కనెక్ట్‌ సెషన్లు, హ్యాకథాన్లు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రత్యేక జాబ్‌ మేళాలు ఏర్పాటు చేస్తామని, ఆయా కళాశాలల్లోని అధ్యాపకులకూ ఏఐ, క్లౌడ్‌ సాంకేతికతలో ప్రపంచస్థాయి శిక్షణ అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్‌ దురిశెట్టి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి, టాస్క్‌ సీఈవో నితిన్‌రెడ్డి, ఏడబ్ల్యూఎస్‌ భారత్‌, దక్షిణాసియా ప్రెసిడెంట్‌ సందీప్‌ దత్తా, ప్రతినిధులు అభినవ్‌, ప్రతిభ, ఆకాంక్షరాయ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

Next Story