కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారింది: కిషన్ రెడ్డి

Union Minister G. Kishan Reddy: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజ్యసభలో అమరావతి బిల్లు చర్చ సందర్భంగం గురువారం జరిగిన వాగ్వాదంలో కిషన్ రెడ్డి కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు.

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరిన సురేశ్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ భాగం పూర్తిగా మునిగిపోయింది. దాని వల్ల ప్రయోజనం లేదని డ్యామ్ కమిటీ, సీఏజీ నివేదికల్లో స్పష్టంగా ఉంది’’ అని చెప్పారు.

కేంద్రం డబ్బులు ఇవ్వలేదని బీఆర్‌ఎస్ ఆరోపిస్తుందని పేర్కొన్న కిషన్ రెడ్డి, ‘‘మరి కేసీఆర్ తన సొంత డబ్బుతోనా ప్రాజెక్టు కట్టారు? అదంతా ప్రజల డబ్బే. వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అప్పులు తెచ్చి నిర్మించారు. అది ప్రజాధనం. నిర్మాణ సమయంలో ఇంజనీర్లు, నిపుణులను సంప్రదించలేదు. అందుకే ఈ దుస్థితి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ముమ్మాటికీ ఏటీఎంలా మారింది’’ అని తీవ్రంగా విమర్శించారు.

ఎన్నికల ముందు కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపి కేసీఆర్‌ను జైలుకు పంపుతామని కాంగ్రెస్ ప్రకటించిందని, కానీ ఇప్పటివరకు ఎందుకు విచారణ జరపలేదు, కేసీఆర్‌ను ఎందుకు జైలుకు పంపలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతి బిల్లు చర్చలో భాగంగా ఈ వాగ్వాదం జరిగింది.

ఈ వ్యాఖ్యలు రాజ్యసభలో బీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story