కిషన్‌రెడ్డి-సురేశ్‌రెడ్డి తీవ్ర వాగ్వాదం

Kaleshwaram Project: కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అంశంపై రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ ఎంపీ సురేశ్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలపై సురేశ్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

అయితే సురేశ్‌రెడ్డి వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మేడిగడ్డ స్లూస్‌ గేట్లు పనికిరాని స్థితికి రావడానికి బీఆర్‌ఎస్‌ పార్టీనే కారణమని, ఇదే విషయాన్ని నిపుణుల కమిటీ కూడా స్పష్టంగా తెలిపిందని ఆరోపించారు.

“కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ కుటుంబం ఏటీఎంలా వాడుకుంది. ఇంజినీర్లను కూడా అడగకుండా ప్రాజెక్టు చేపట్టారు. రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఖర్చు చేశారు. కేసీఆర్‌ను జైల్లో పెడతానన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు ఏం చేశారు? ఆనాడు ఏడు మండలాల విలీనానికి కేసీఆర్‌ ఒప్పుకున్నారు. విలీనం తర్వాత కూడా సోనియా గాంధీ ఇంటికి వెళ్లారు” అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

ఈ విషయంపై స్పందించిన సురేశ్‌రెడ్డి, కేసీఆర్‌ చేసిన పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. “ప్రాంతాలుగా వేరవుదాం.. అన్నదమ్ముల్లా కలిసి ఉందామని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ అనుమతి లేకుండానే కొన్ని మండలాలను ఏపీలో కలిపేశారు. ఏడు మండలాల విలీనం సమయంలో ఎలాంటి చర్చలు జరగలేదు. తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ పలుమార్లు చెప్పారు. ఏపీ విభజన బిల్లును పునర్నిర్మాణ బిల్లుగా మార్చవద్దు” అని డిమాండ్‌ చేశారు.

12 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రం ఎలాంటి సహాయం చేయలేదని, కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని సురేశ్‌రెడ్డి తెలిపారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కూడా హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story