Rythu Bharosa Funds: రైతులకు గుడ్ న్యూస్: 22 నుంచి రైతు భరోసా నిధుల విడుదల – మూడు విడతల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి
మూడు విడతల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి

Rythu Bharosa Funds: తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరోసారి భరోసా ఇచ్చింది. రైతు భరోసా పథకం కింద ఈ సీజన్‌కు సంబంధించిన నిధులు మూడు విడతల్లో విడుదల చేయనుంది. మొత్తం రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
ఎకరానికి రూ.6 వేల చొప్పున 1.50 కోట్ల ఎకరాలకు మొత్తం రూ.9 వేల కోట్ల రైతు భరోసా సాయం రైతులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదివారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థికశాఖ అధికారులతో సమావేశమై ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌పామ్ కర్మాగారం ప్రారంభోత్సవ సభలో సీఎం మొదటి విడత నిధులను విడుదల చేస్తారు. ఈ దఫాలో ఒక ఎకరం వరకు భూమి ఉన్న 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లు జమ చేస్తారు.
రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత (ఏప్రిల్ మధ్యలో) రూ.2,650 కోట్లు విడుదల చేస్తారు. మూడో విడతగా ఏప్రిల్ నెలాఖరులోపు రూ.2,760 కోట్లు జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి ఉపముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి తుమ్మల, ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీకి కట్టుబడిన ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతిగా నిరూపించుకుందని పేర్కొన్నారు.
సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ పాల్గొన్నారు.
ప్రస్తుతం యాసంగి సీజన్ సాగుతున్న నేపథ్యంలో ఈ నిధులు రైతుల పెట్టుబడులకు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. మరో రెండు నెలల్లో వానాకాలం ప్రారంభమవుతుంది. నర్మెటలోని కార్యక్రమంలో ఆయిల్‌పామ్ కర్మాగారం ప్రారంభం, రూ.40 కోట్లతో నూనె రిఫైనరీకి శంకుస్థాపన, వ్యవసాయ ప్రదర్శనతో పాటు భారీ సభ నిర్వహిస్తున్నారు. రైతుల సమక్షంలో నిధుల విడుదలకు ఇది అనువైన వేదికగా భావించి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు మూడు విడతల్లో పెట్టుబడి సాయం అందించింది. తాజా విడుదలతో నాలుగో సీజన్‌కు నిధులు అందుతాయి. 2023-24 యాసంగిలో ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.7,625 కోట్లు, 2024-25 యాసంగిలో రూ.5 వేల చొప్పున రూ.5,057 కోట్లు, 2025-26 వానాకాలంలో రూ.6 వేలకు పెంచి రూ.8,800 కోట్లు జమ చేసింది. ఈ ఏడాది 73 లక్షల మంది రైతులకు రూ.8,881 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ నివేదించగా, రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో రూ.9 వేల కోట్లు విడుదలకు ప్రభుత్వం అంగీకరించింది.

