జిల్లా కలెక్టర్లను ఆదేశించిన సీయం రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖ‌ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ లో మూడు గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర సచివాల‌యంలో ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేకంగా మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వరద నీటి ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారుల‌కు సీఎం సూచించారు. రానున్న రెండు మూడు రోజులు వ‌ర్షాలు ఉంటాయ‌నే స‌మాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని సీయం కలెక్టర్లను ఆదేశించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. విప‌త్తు స‌హాయ‌క బృందాలు అందుబాటులో ఉండాల‌ని, అవసరమైన చోట్ల త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని సీఎం ఆదేశించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story