Minister Vivek: పాలిటెక్నిక్‌ కళాశాలలను స్కిల్స్‌ వర్సిటీ పరిధిలోకి తీసుకొని ఆధునికీకరించి, విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జీఓ 97లో తగిన మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శక్తి శాఖ మంత్రి వివేక్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీలో శుక్రవారం విద్యారంగ సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు.

‘పాలిటెక్నిక్‌ కళాశాలలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా మార్చేందుకు రూ.8 వేల కోట్ల ప్రతిపాదనలు పంపాం. విద్యార్థులందరికీ ఉద్యోగావకాశాలు దక్కేలా స్కిల్స్‌ వర్సిటీ పరిధిలోకి తీసుకొస్తున్నాం. అయితే ప్రైవేటీకరణ చేస్తారని అధ్యాపకులు, విద్యార్థులు అపోహ పడుతున్నారు. దీనిపై కమిటీని నియమించాం. కమిటీ సిఫారసుల మేరకు జీఓ 97లో మార్పులు చేస్తాం’ అని మంత్రి వివేక్‌ వెల్లడించారు. స్కిల్స్‌ వర్సిటీ కిందకు తెచ్చినా కోర్సులకు ఏఐసీటీఈ గుర్తింపు ఉంటుందని, ఈసెట్‌ ద్వారా లేటరల్‌ ఎంట్రీతో బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌లో చేరవచ్చని, ఫీజు పెరగదని ఆయన స్పష్టం చేశారు. పాలిటెక్నిక్‌ కళాశాలల భూములను అమ్ముతామని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాస్తవానికి ప్రభుత్వం 282 ఎకరాలు ఇచ్చిందని తెలిపారు.

విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. భాజపా సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వరు.. హాస్టళ్లలో పురుగుల అన్నం, పాము కాట్లు.. విద్యారంగం సంక్షోభంలో ఉంది’ అని మండిపడ్డారు. బాసర ఆర్‌జీయూకేటీలో 222 మందికి బదులు కేవలం 19 మంది రెగ్యులర్‌ ఆచార్యులు మాత్రమే ఉన్నారని, రాష్ట్ర వర్సిటీల్లో 73 శాతం ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన విమర్శించారు. ‘ఆచార్యుల ఖాళీలతో నాణ్యమైన విద్య ఎలా అందించగలరు?’ అని ప్రశ్నించారు.

సీపీఐ సభాపక్షనేత కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్‌రెడ్డిని అభినందిస్తూ ‘మనిషి రఫ్‌గా ఉంటారు.. చాలా మంది సీఎంలకు ఒకటే భాష వచ్చు. కానీ రేవంత్‌రెడ్డికి తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఉంది. విద్యారంగాన్ని పట్టుబట్టి అభివృద్ధి చేస్తున్నారు’ అన్నారు. సీఎస్‌ఆర్‌ నిధులను బాగా వినియోగించుకుంటున్నారని, రాష్ట్రంలో 612 మండలాలకు రెగ్యులర్‌ ఎంఈఓలు లేరని, దానిపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రాలే ‘నీట్‌’ నిర్వహించుకునేలా తీర్మానం చేసి పంపాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు సభ్యుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎంఐఎం సభ్యులు మాజీద్‌ హుస్సేన్‌, అలీ మాట్లాడారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ విద్యపై పాట పాడి వినిపించారు. విద్యారంగంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, ప్రతిపక్షాల విమర్శలు, మంత్రి స్పష్టీకరణలతో అసెంబ్లీలో సజీవ చర్చ జరిగింది.

Next Story