CM Revanth Reddy: రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ స్ఫూర్తినిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్కూల్‌లోని డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌, లైబ్రరీ, ల్యాబ్స్‌, అత్యాధునిక కిచెన్‌, డైనింగ్‌ హాల్‌లను సీఎం పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఆహ్లాదకరమైన మైదానంలో విద్యార్థులతో ఫుట్‌బాల్‌ ఆడి వారితో సరదాగా గడిపారు.

ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. “రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు రూ.27 వేల కోట్లు విద్యాశాఖపైనే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రుల్లో ఉన్న అపోహలను తొలగించడానికే టీపీఎస్‌ల నిర్మాణం చేపట్టాం.

విద్య మాత్రమే జీవితాలను మార్చగలదు. సమాజంలో అసమానతలు తొలగించాలంటే అందరికీ నాణ్యమైన విద్య అందించాలి. ప్రభుత్వ బడుల్లో చదవడం నామోషీ అనే ఆలోచన పూర్తిగా పోవాలి. ఇక్కడ చదివి ఐఏఎస్‌, ఐపీఎస్‌, సీఎంలు అయిన వాళ్లు ఎందరో ఉన్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వం కులాల వారీగా స్కూళ్లు పెట్టి కుల వ్యవస్థను ప్రోత్సహించిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిందని సీఎం విమర్శించారు. కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామని, త్వరలోనే యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ప్రారంభిస్తామని ప్రకటించారు.

క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపడానికి మెస్సీని హైదరాబాద్‌కు తీసుకురావడానికి విమర్శలు చేశారని, గత ప్రభుత్వం ఇచ్చిన యూనిఫామ్‌లు నెల రోజుల్లోనే చిరిగిపోయాయని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం నాణ్యమైన వస్తువులతో విద్యా కిట్లు అందిస్తోందని, వాటి పంపిణీ కోసం రూ.680 కోట్లతో టెండర్లు పిలిచామని తెలిపారు. విద్యారంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story