BC Reservations : స్థానిక సంస్ధల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై త్వరలో ఆర్డినెన్స్

బలహీన వర్గాలకు వచ్చే స్థానిక సంస్ధల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఆమేరకు టిక్కెట్లు కేటాయించాలని తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించింది. డాక్టర్ బీఆర్‌అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంపై త్వరలో ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే స్థానిక సంస్ధల్లో రిజర్వేషన్ల అమలుకు కీలకమైన పంచాయితీ చట్ట సవరణకు కూడా క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఏడాది లోపల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రం మొత్తం కుల గణన నిర్వహించింది. ఈ కుల గణనలో రాష్ట్రంలో బీసీల సంఖ్య 42 శాతంగా ఉన్నట్లు నిర్ధారించింది. కులగణనలో వెల్లడైన శాతాల దామాషా ప్రకారం బీసీలకు రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ సంవత్సరం జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించింది. అయితే ఈ రిజర్వేషన్ల అమలుకు చట్ట పరంగా అనేక సాంకేతిక సమస్యలు ఉన్న కారణంగా అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. కానీ తాజాగా న్యాయస్ధానాల ఆదేశాల ప్రకారం స్థానిక సంస్ధల ఎన్నికలు రెండు నెలల్లో పూర్తి చేయాల్సి రావండతో ఆ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలుగా ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.
